`మా` సెగలు రోజురోజుకీ పెరగడం తప్ప తగ్గేట్టు కనిపించడం లేదు. సినిమా పరిశ్రమలో `మా బిల్డింగ్` రేపుతున్న చిచ్చు అంతా ఇంతా కాదు. ఎన్నికలకు ఇదే ప్రధాన ఎజెండా. అయితే మా కి ఇది వరకే ఓ బిల్డింగ్ ఉందని, దాన్ని అనవసరంగా అమ్మేశారని.. ఇటీవల మోహన్ బాబు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఫ్లాష్ బ్యాక్ బయటకు తీయాల్సివచ్చింది. మా బిల్డింగ్ ఎందుకు కొన్నారు? ఎందుకు అమ్మేశారు? ఇప్పుడు దాని కోసం ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. దానిపై ఇప్పుడు నాగబాబు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
మెగా బ్రదర్ నాగబాబు కూడా `మా` ప్రెసిడెంటుగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆయన హయాంలోనే శ్రీనగర్ కాలనీలో `మా` కోసం ఓ ఫ్లాట్ తీసుకున్నారు. అది కూడా మా మూలధనం నుంచే. అప్పటికి మా మూలధనం దాదాపు కోటి ఇరవై లక్షల వరకూ ఉందట. ప్రతీ యేడాదీ ఆ మూలధనంపై అనవసరంగా టాక్స్ చెల్లించాల్సివస్తుందని, ఆ డబ్బులతో ఓ ఫ్లాట్ కొంటే, ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిన పనిలేదని భావించార్ట. అందుకే శ్రీనగర్ కాలనీలో 90 లక్షలతో ఫ్లాట్ తీసుకున్నార్ట. అయితే కొంతకాలానికి దాన్ని కేవలం 35 లక్షలకు అమ్మేశార్ట. అది కూడా.. శివాజీరాజా ప్రెసిడెంటుగా ఉన్న హయాంలో. ఈ విషయాలన్నీ నాగబాబు ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు
శివాజీరాజా ఈ ఫ్లాట్ ని ఎందుకు అమ్మాల్సివచ్చింది? అనేది నాగబాబు సూటి ప్రశ్న. కోటి నలభై లక్షల విలువైన ఫ్లాట్ ని 35 లక్షలకు అమ్మేశారని, అలా ఎందుకు చేయాల్సివచ్చిందని... నాగబాబు ఫైర్ అయ్యారు. మరి... దీనికి ఎవరు సమాధానం చెబుతారో?