నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి
దర్శకత్వం : బుచ్చిబాబు సానా
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
సంగీతం : దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ : షామ్‌దత్ సైనుద్దీన్
ఎడిటింగ్ : నవీన్ నూలి
రేటింగ్: 3/5
ప్రేమకథల్లో కొత్త పాయింట్ అంటూ ఉండదు. ఎందుకంటే ప్రతీ ప్రేమ కథ.. ఒకేలా మొదలై, ఒకేలా పూర్తవుతుంది. ఆ ప్రేమకు ఎదురయ్యే సవాళ్లు, వాటిని ప్రేమికులు ఎదుర్కొనే విధానాన్ని బట్టే - ఆ ప్రేమ కథలో కొత్త కోణాలు బయటపడతారు. ఓ పేదింటి అబ్బాయి, గొప్పింటి అమ్మాయిని ప్రేమించడం అనే పాయింట్.. ఇప్పటిది కాదు. ప్రేమకథలు పుట్టినప్పటి నుంచీ ఉంది. `ఉప్పెన` కాన్సెప్టు కూడా ఇదే. రాజు - పేద టైపు ప్రేమకథ. దానికి `పరువు` అనే మరో పొర చేరింది. మరి.. ఈ ప్రేమకథని దర్శకుడు కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడా? ఆ కొత్త దనం ఏయే విషయాల్లో కనిపిస్తుంది? ఇంతకీ ఈ ఉప్పెన ఎవరికి నచ్చుతుంది?
* కథ
ఆశి (వైష్ణవ్ తేజ్) ఓ పేదింటి అబ్బాయి. సముద్రాన్ని నమ్ముకుని జీవనం కొనసాగిస్తుంటారు. శేషారాయనం (విజయ్ సేతుపతి) కూతురు.. బేబమ్మ (కృతి శెట్టి). రాయనంకి పరువే ముఖ్యం. పరువు పోతే ప్రాణం పోయినట్టే భావిస్తుంటాడు. బేబమ్మని చిన్నప్పటి నుంచీ ఆశీ ఇష్టపడుతూనే ఉంటాడు. దొంగచాటుగా చూస్తూ ప్రేమించేస్తాడు. ఓసారి బేబమ్మ కూడా ఆశీని చూస్తుంది. అప్పటి నుంచీ ఇష్టపడుతుంది. తండ్రికి తెలియకుండా... దొంగ చాటుగా ఆశిని చూడ్డానికి వస్తుంటుంది. కాలేజీ ఎగ్గొట్టి... ఆశీతోనే తిరుగుతుంటుంది. ఓసారి వీళ్ల ప్రేమకథ.. రాయనంకి తెలిసిపోతుంది. ఆ తరవాత ఏమైందన్నదే.. అసలు కథ.
* విశ్లేషణ
ఇది మామూలు ప్రేమకథే అయినా అంతర్లీనంగా కొన్ని విషయాలు కనిపిస్తుంటాయి. ఒకటి.. పరువు. మరోటి.. మగతనానికి నిర్వచనం. పరువు నేపథ్యంలో ఈమధ్య చాలా కథలొచ్చాయి. కేవలం ఆ పాయింట్ పైనే దృష్టి పెడితే.. ఉప్పెన ఈ తానులో ముక్కే అయ్యేది. కానీ... మగాడంటే అర్థమేమిటి? ఆడది మగతనాన్ని చూసే కోణం ఏమిటి? అనే సున్నితమైన పాయింట్ కూడా ఇందులో చర్చించారు. కాబట్టి... క్లైమాక్స్ లో ఈ సినిమా సమ్ థింగ్ స్పెషల్ అనిపిస్తుంది.
గొప్పింటి అమ్మాయి - పేదింటి అబ్బాయి మధ్య సాగే సన్నివేశాలు పాత సినిమాల ఛాయల్లోనే సాగుతుంటాయి. కానీ వైష్ణవ్ తేజ్ ఫ్రెష్ ఫేస్, కృతి అందం, దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆ పాటలు, చక్కటి ఫొటోగ్రపీ... ఇవన్నీ కలిసి ఈ సన్నివేశాల్ని బాగా ఎలివేట్ చేశాయి. అన్నింటికంటే ముఖ్యంగా విజయ్ సేతుపతి ఎపీరియన్స్ ఈ సినిమాని ఇంకో లెవల్ కి తీసుకెళ్తుంటుంది. ప్రధమార్థం వరకూ... ఎలాంటి స్పీడ్ బ్రేకర్లూ పడవు. కానీ.. ద్వితీయార్థంలోనే కష్టాలు మొదలవుతాయి. ఇంట్లోంచి పారిపోయిన ప్రేమ జంటకు ఎలాంటి కష్టాలు ఉంటాయో.. అవన్నీ మళ్లీ ఈ సినిమాలో కనిపిస్తుంటాయి.
ద్వితీయార్థంలో చాలా వరకూ సాగదీతే. తొలి సగంలో ఉన్న షార్ప్‌నెస్ మిస్సవ్వడం, పాటలకు స్కోప్ లేకపోవడంతో ద్వితీయార్థం తేలిపోయింది. మళ్లీ.. క్లైమాక్స్ లో ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకి ఆయువు పట్టు క్లైమాక్స్ అని దర్శక నిర్మాతల నమ్మకం. దాన్ని నమ్మే ఇంత కథా తీశారు. అయితే ఆ తరహా క్లైమాక్స్ మనవాళ్లకు ఎంత వరకూ ఎక్కుతుందన్న ప్రధాన ప్రశ్న. కాకపోతే... ఆ క్లైమాక్స్ ని బాగానే రాసుకున్నారు. కృతి శెట్టి - విజయ్ సేతుపతి మధ్య జరిగే సంభాఫణలు ప్లస్ పాయింట్ గా మారాయి. దాంతో... ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
మగతనం అంటే.. రెండు కాళ్ల మధ్య ఉండేది కాదు, వాడు నా మీద పడుకోకపోయినా ఫర్వాలేదు, పక్కన పడుకుంటే చాలు... ఇలాంటి డైలాగులు ఈ కథలోని డెప్త్ తెలియజేస్తాయి. ఓ తండ్రీ కూతుళ్ల మధ్య ఇలాంటి సంభాషణలు రాసుకోవడం సాహసమే. అదే... ఉప్పెనకు కొత్త లుక్ తీసుకొచ్చాయి.
* నటీనటులు
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి.... ఇద్దరికీ ఇది తొలి సినిమానే. కానీ ఆ బెరుకు, భయం ఇద్దరిలోనూ లేవు. వీరిద్దరి ఫ్రెష్ నెస్ ఈ కథకు బలాన్ని తీసుకొచ్చింది. పాత కథ ఫ్రెష్ గా ఫీలవ్వడానికి కారణం.. వీళ్లే. ముఖ్యంగా కృతి శెట్టికి మంచి లైఫ్ ఉంది. ఎంత అందంగా కనిపించిందో, క్లైమాక్స్ లో అంతే బాగా అభినయించింది. చాలా చోట్ల కళతోనే హావ భావాలు పలికించింది. విజయ్‌సేతుపతి ఓ మాస్టర్. ఈమధ్య కాలంలో విలన్ ని ఇంత పవర్ ఫుల్ గా ఎవరూ చూపించలేదు. అయితే.. విజయ్ సేతుపతి డబ్బింగ్ బాగా డామినేట్ చేసింది.
* సాంకేతిక నిపుణులు
ఈ సినిమాకి అసలైన హీరోలు సాంకేతిక నిపుణులు. దేవి శ్రీ అందించి పాటలు సూపర్బ్. వాటిని అంతేబాగా తెరకెక్కించారు. ఫొటోగ్రఫీ క్లాస్ గా ఉంది. బుచ్చిబాబు రైటర్ గానూ తన పనితనం చూపించాడు. తన సంభాషణలు నచ్చుతాయి. మైత్రీ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ద్వితీయార్థంలో ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది.
* ప్లస్ పాయింట్
పాటలు
ఫొటోగ్రఫీ
హీరో - హీరోయిన్
క్లైమాక్స్
* మైనస్ పాయింట్స్
సెకండాఫ్
* ఫైనల్ వర్డిక్ట్: ప్రేమ ఉప్పెన!