చిత్రసీమలో సెంటిమెంట్లకు కొదవ లేదు. టైటిల్స్, రిలీజ్ డేట్లు, కాంబినేషన్లు... ఈ విషయాల్లో హీరోలు, దర్శకులు, నిర్మాతలూ సెంటిమెంట్లు ఫీలవుతారు. మహేష్ బాబుకి కూడా ఇలాంటి సెంటిమెంట్లు చాలానే ఉన్నాయి. ఈమధ్య మహేష్ సంక్రాంతి రిలీజ్ ని సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలు సంక్రాంతికి విడుదలై... సూపర్ హిట్టయ్యాయి. అందుకే సంక్రాంతి రిలీజ్ పై ఫోకస్ పెట్టాడు మహేష్. తన తాజా సినిమా `సర్కారు వారి పాట`నీ సంక్రాంతికే తీసుకొస్తున్నారు.
అయితే.. ఈ సినిమా దసరా నాటికి రెడీ అయిపోతుందని దర్శక, నిర్మాతల నమ్మకం. దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నార్ట. అయితే... మహేష్ మాత్రం పట్టుబట్టి, సంక్రాంతికి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ దసరాకి `ఆర్.ఆర్.ఆర్` విడుదల అవుతోంది. ఆ టైమ్ లో పక్కన ఎలాంటి సినిమా ఉన్నా రిస్కే. దానికి తోడు.. సంక్రాంతి సీజన్ లో సినిమా వస్తే... హిట్టయిపోతుందన్న నమ్మకం మహేష్ లో బలపడిపోయింది. అందుకే.. సంక్రాంతికి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది.