నటీనటులు: వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అధర్వ, మృణాళిని రవి, బ్రహ్మనందం, బ్రహ్మజీ, సత్య తదితరులు
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
సంగీతం: మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫర్: ఆయాంక బోస్
విడుదల తేదీ: సెప్టెంబర్ 20, 2019
రేటింగ్: 2/5
వివాదాల మధ్య విడుదలైన సినిమా `గద్దలకొండ గణేష్`. `వాల్మీకి` అనే పేరుతో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా విడుదలకి ముందు రోజు రాత్రి `గద్దలకొండ గణేష్` అని పేరు మార్చుకుంది. తమిళంలో విజయవంతమైన `జిగర్‌తాండ`కి రీమేక్‌గా రూపొందిన సినిమా ఇది. తమిళంలో ఓ క్లాసిక్‌గా ప్రేక్షకుల మెప్పు పొందిన చిత్రం `జిగర్‌తాండ`. రజనీకాంత్‌లాంటి కథానాయకుడు సైతం ఈ సినిమాని చూసి ఇందులో విలన్ పాత్ర నాకు ఇచ్చుంటే చేసుండేవాణ్ని అన్నారు.
దీన్నిబట్టి ఆ పాత్ర ఏ స్థాయిలో రూపుదిద్దుకుందో అర్థం చేసుకోవచ్చు. ఆ పాత్ర కోసం వరుణ్‌తేజ్‌ని ఎంపిక చేసుకొని హరీష్‌శంకర్ `జిగర్‌తాండ` రీమేక్‌ని పట్టాలెక్కించడం అందరి దృష్టినీ ప్రత్యేకంగా ఆకర్షించింది. `గబ్బర్‌సింగ్` తర్వాత హరీష్ మరో రీమేక్ చేస్తుండడం... అందులో వరుణ్‌తేజ్ విలనిజం ప్రదర్శిస్తుండడం... ప్రచార చిత్రాలు... వివాదాలు... అంచనాలు... ఇలా సినిమా ప్రేక్షకుల్లో కాల్సినంత ఆసక్తిని రేకెత్తించింది. మరి సినిమా అంచనాలకి తగ్గట్టుగానే ఉందో లేదో తెలుసుకుందాం...
* కథ
చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎదగాలనేది అభిలాష్ (అధర్వ) ఆశ. సహాయ దర్శకుడిగా పనిచేస్తూ ఎన్నో అవమానాల్ని ఎదుర్కుంటాడు. కానీ ఆయన తపన నచ్చి నిర్మాత అవకాశం ఇస్తాడు. తొలి ప్రయత్నంగా విలనే హీరోగా సినిమా చేయాలనుకుంటాడు అభి. ఆ ప్రయత్నంలో భాగంగా గ్యాంగ్‌స్టర్ అయిన గద్దలకొండ గణేష్ అలియాస్ గని (వరుణ్‌తేజ్) జీవిత కథని సినిమాగా తీయాలనుకుంటాడు.
అందుకోసం ఆయన జీవితం గురించి తెలుసుకునేందుకు గద్దలకొండకి వెళతాడు. ఆ క్రమంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ గణేష్ వ్యక్తిగత జీవితం గురించి అభికి ఎలాంటి విషయాలు తెలిశాయి? కథ సిద్ధమయ్యాక అందులో ఎవరు కథానాయకుడిగా నటించారు? సినిమా విడుదల తర్వాత గణేష్ జీవితం ఎలా మారిపోయింది? తదితర విషయాలే మిగిలిన కథ.
* నటీనటులు
గద్దలకొండ గణేష్‌గా వరుణ్‌తేజ్ అదరగొట్టాడు. ఆయన గెటప్పు... డైలాగ్ డెలివరీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దర్శకుడు ఆ క్యారెక్టరైజేషన్ని తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. పూజాహెగ్డే శ్రీదేవి పాత్రలో మెరుపులు మెరిపించింది. ఎల్లువొచ్చి గోదారమ్మ... రీమిక్స్ పాటలో శ్రీదేవిని గుర్తు చేసింది.
అధర్వ, మృణాళిని రవి పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. అధర్వకి డబ్బింగే అతకలేదనిపిస్తుంది. సత్య, బ్రహ్మాజీ, రచ్చ రవి తదితరులు కామెడీ పండించారు. తనికెళ్ల భరణి, అన్నపూర్ణమ్మ, శత్రు పాత్రల పరిధి మేరకు నటించారు. డింపుల్ హయాతి చేసిన ప్రత్యేకగీతం బాగుంది.
* సాంకేతిక వర్గం
సాంకేతిక విభాగానికొస్తే ఛాయాగ్రాహకుడు ఐనాంక బోస్ విలేజ్ బ్యాక్ డ్రాప్ గ్యాంగ్‌స్టర్ సినిమాకి తగ్గట్టుగా, ఆ మూడ్‌ని ఎలివేట్ చేసేలా లైటింగ్ చేసుకున్నారు. అది సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మిక్కీ జె.మేయర్‌లో మంచి మాస్ సంగీత దర్శకుడు ఉన్నాడని ఈసినిమా నిరూపిస్తుంది. ఆయన సమకూర్చిన పాటలు, నేపథ్య సంగీతం మెప్పిస్తుంది.
ఎడిటింగ్ పరంగా ఛోటా కె.ప్రసాద్ చాలా చోట్ల ఉదాసీనంగా వ్యవహరించారు. దాంతో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడిగా, రచయితగా హరీష్‌శంకర్ మెప్పిస్తాడు. ఆయన రాసుకున్న సంభాషణల్లోనూ, ఆయన చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానంలోనూ మంచి పరిణతి కనిపిస్తుంది.
* విశ్లేషణ
రీమేక్ సినిమా అంటే చాలా లెక్కలుంటాయి. మాతృకలోని కథ మారకూడదు. అలాగని ఉన్నదున్నట్టుగా తీయకూడదు. అన్ని సినిమాలకీ ఇదే సూత్రం వర్తిస్తుందని కూడా చెప్పలేం. ఏది ఎప్పుడు ఎలా మార్చాలో తెలిసుండాలి. అప్పుడే రీమేక్ మన గోడకి అతుకుతుంది. లేదంటే సమస్యలే. `గబ్బర్‌సింగ్` సినిమానే తీసుకోండి. దానికి మాతృక అయిన `దబాంగ్`కి బోలెడన్ని మార్పులు చేసి తెరకెక్కించాడు హరీష్‌శంకర్. అది సూపర్‌హిట్టు. ఆయన మరోసారి రీమేక్ చేస్తున్నారనగానే ఇక్కడ కూడా చాలా మార్పులే చేస్తుంటాడని ఊహించారంతా.
కానీ క్లాసిక్ అనిపించుకొన్న `జిగర్తాండ`లాంటి సినిమాకి మార్పులు చేసి తీయడం సాధ్యమేనా అనే సందేహాలు కూడా వచ్చాయి. ఇక్కడే హరీష్‌శంకర్ తన అనుభవాన్ని రంగరించారు. క్లాసిక్‌లాంటి జిగర్‌తాండ`లో మార్పులేమీ చేయకుండా.. క్యారెక్టరైజేషన్‌లపై దృష్టిపెట్టారు. తెలుగు వాతావరణానికి, ఇక్కడి తారలకి అనుగుణంగా సన్నివేశాల్ని రాసుకొన్నారు. దాంతో మాతృకలోని కథ చెడకపోగా... పాత్రల్లోనూ, సన్నివేశాల్లోనూ మరింత బలం పెరిగింది. అక్కడే సినిమాకి సగం విజయం దక్కినట్టైంది. ఆరంభ సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తించినా.. అసలు కథ మొదలుపెట్టడానికి బాగా సమయం తీసుకొన్నాడు దర్శకుడు. అభిలాష్ గద్దలకొండకి వెళ్లడం, అక్కడ చింతపండు కొండమల్లి (సత్య)ని కలవడం దగ్గర్నుంచే కథలో వేగం పుంజుకుంటుంది.
సన్నివేశాల్లో భాగంగా వినోదం పండుతుండడంతో సరదాగా సాగిపోతుంటుంది సినిమా. గద్దలకొండ గణేష్ పాత్ర ఎంట్రీతో సినిమా మరో స్థాయికి వెళుతుంది. ఆయన చేసే దందాలు, శత్రవుల్ని ఎదుర్కునే తీరు మెప్పిస్తుంది. కథ పరంగా ప్రథమార్థంలో చెప్పుకోవల్సినంత ఏమీ లేకపోయినా.. సన్నివేశాలు మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుంటాయి. ద్వితీయార్థంలోనే కథలో మలుపులు చోటు చేసుకుంటాయి. భావోద్వేగాలు కూడా మెప్పిస్తాయి. సినిమా ప్రపంచం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చిత్రానికి ప్రధానబలం. అన్నీ ఒకెత్తైతే... గణేష్ ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ మరో ఎత్తు. వరుణ్, పూజల మద్య సన్నివేశాల్ని తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్ ఆకట్టుకున్నా... ప్రి క్లైమాక్స్ మాత్రం సాగదీతలా అనిపించడం సినిమాకి మైనస్‌గా మారింది.
* ప్లస్ పాయింట్స్
వరుణ్ తేజ్
కామెడీ
* మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
ఫ్లాష్ బ్యాక్
సెంటిమెంట్
ఫైనల్ టచ్
హరీష్‌శంకర్ మార్క్ మాస్ అంశాల మేళవింపుతో సాగే చిత్రమిది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో అన్నట్టుగా... ఎక్కడ ఏం మార్చాలో, ఏం మార్చకూడదో తెలుసుకొని చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. గత్తర్‌లేపేలా గద్దలకొండ గణేష్ పాత్రని తీర్చిదిద్దుకొని... కథని ఏమాత్రం ముట్టుకోకుండా తీసిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది.
* ఫైనల్ వర్డిక్ట్: గణేష్... అంచనాలను అందుకోలేదు.
- రివ్యూ రాసింది శ్రీ