తారాగణం: రామ్‌చరణ్, కియారా అడ్వాణీ, ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్, వివేక్ ఒబెరాయ్, ప్రకాష్‌రాజ్, మధుమిత, ముఖేష్ రిషి, మధునందన్, మహేష్ మంజ్రేకర్, హిమజ, ఈషాగుప్తా & తదితరులు
నిర్మాణ సంస్థ: డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, రిషి పంజాబీ
నిర్మాత: డి.వి.వి.దానయ్య
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
విడుదల: 11 జనవరి 2019
రేటింగ్: 2.25/5
ఈ యేడాది సంక్రాంతి చిత్రాల్లో భాగంగా బాక్సీఫీసు ముందుకొచ్చిన మూడో సినిమా `వినయ విధేయ రామ`. మాస్ కథానాయకుడైన రామ్‌చరణ్‌తో కలిసి... మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను చేసిన చిత్రమిది. ఇలాంటి కాంబినేషన్లకి ఉండే క్రేజే వేరు. అటు అభిమానులకి కావల్సినవి... ఇటు సగటు ప్రేక్షకుడు కోరుకొనే మాస్ అంశాలు సమపాళ్లలో మేళవించడం బోయపాటి శైలి. అందుకే ఆయనతో కలిసి నటించేందుకు కథానాయకులు ఆసక్తి చూపుతుంటారు. కలయిక పరంగానూ... ప్రచార చిత్రాలతోనూ అంచనాలు పెంచిన `వినయ విధేయ రామ` ఎలా ఉందో తెలుసుకొందామా మరి...
కథ
రామ (రామ్‌చరణ్) ఓ అనాథ. చిన్నప్పుడు ముళ్లకంపల మధ్య పడి ఉండటం చూసి... వీధి బాలలైన నలుగురు పిల్లలు గమనిస్తారు. వాళ్లే వైద్యం చేయించి పెంచుకొంటారు. అప్పట్నుంచి ఆ ఐదుగురు అన్నదమ్ములుగా మారిపోతారు. తన అన్నయ్యల కోసం చిన్నప్పట్నుంచే రామ చాలా త్యాగాలు చేస్తాడు. పెద్దయ్యాక రామ పెద్దన్నయ్య భువన్ కుమార్ (ప్రశాంత్) రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తుంటాడు. విధుల పట్ల నిక్కచ్చిగా ఉండే భువన్‌కి ప్రతిపక్షనాయకుడు పందెం పరశురామ్ (ముఖేష్ రుషి), బిహార్‌కి చెందిన రాజా భాయ్ (వివేక్ ఒబెరియ్)లతో వైరం ఏర్పడుతుంది. సమాంతర ప్రభుత్వం నడిపించే రాజా భాయ్ నుంచి రామ కుటుంబానికి ముప్పు ఏర్పడుతుంది. మరి రామ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకొన్నాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు..
రామ్‌చరణ్ చేసిన డ్యాన్సులు, ఫైట్లు తప్ప ఆయన్నుంచి కొత్తగా ఏమీ కనిపించలేదు. భావోద్వేగాలు పండించే ఆస్కారం కూడా లభించలేదు. కథానాయిక కియారా కూడా డ్యాన్సులకి, కాసిన్ని సన్నివేశాలకి పరిమితమైంది. వివేక్ ఒబెరాయ్ రాక్షసత్వం ఉట్టిపడే పాత్రలో కనిపిస్తాడు. తన పాత్ర వరకు బాగానే న్యాయం చేశాడు. కానీ కథ, కథనాల్లోనే విషయం లేకపోవడం ప్రతి పాత్ర తేలిపోయింది. మిగతా పాత్రలన్నీ కూడా ఓవర్‌యాక్షన్‌కే పనికొచ్చాయి తప్ప అవి పండలేదు. ఒకొక్క ఫ్రేమ్‌లోనలుగురైదుగురు నటులు కనిపిస్తుంటారు. అదంతా సినిమా బడ్జెట్ పెంచడానికి పనికొచ్చిందేమో కానీ... సినిమాకి మాత్రం ఏం ప్రయోజనం లభించలేదు.
విశ్లేషణ...
`ఒక్కడికీ ట్రైనింగ్ లేదు, ఒక్కడిలోనూ టైమింగ్ లేద`ని ఓ డైలాగ్ చెబుతాడు రామ్‌చరణ్ ఈ సినిమాలో. మొత్తంగా చూస్తే ఈ సినిమా పరిస్థితి కూడా అంతే. ఇందులో దేనికీ టైమింగ్ ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు యాక్షన్ సన్నివేశాలు వస్తుంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు పాటలొస్తుంటాయి. యాక్షన్ చేస్తున్నప్పుడు నవ్వొస్తుంది? ఇవి ఎమోషన్ సన్నివేశాలేమో అనుకుంటే అందులో ఓవర్ యాక్షన్, మెలోడ్రామాలే కనిపిస్తాయి తప్ప భావోద్వేగాలు పండవు. మన తెలుగు కథలు ఇప్పుడిప్పుడే భూమార్గం పట్టాయని సంబరపడుతున్న ఈ దశలోనూ ఓ అగ్ర దర్శకుడి నుంచి ఇలాంటి సినిమా రావడం ఆశ్చర్యమే.
బోయపాటి తన కొలతలకి తగ్గట్టుగానే హీరోయిజాన్ని, విలనిజాన్ని ప్లాన్ చేసుకొన్నాడు. కానీ వాటిని పండించడానికి తగిన భావోద్వేగాలు కావాలి, ఆ భావోద్వేగాల కోసం తగిన కథ కూడా ఉండాలనే విషయాన్ని మరిచిపోయాడు. దాంతో సినిమాలో విలన్, హీరో చేసి వీరోచిత పోరాట ఘట్టాలు, మధ్యలో పాటలు తప్ప అదనంగా ఏమీ ఉండదు. కాస్తలోకాస్త ప్రథమార్థంలో పెళ్లి చూపులు ఎపిసోడ్ మాత్రమే ఉపశమనాన్నిస్తుంది. ఇక మిగతా ఏ సన్నివేశం కూడా లాజిక్‌కి దగ్గరగా ఉండదు. కథ, కథనాలపై సరైన కసరత్తు లేకుండా.... కేవలం కమర్షియల్ అంశాల్నే ఆసరాగా చేసుకొని ఈ సినిమాని చేశాడు దర్శకుడు.
ద్వితీయార్థంలో అయితే హింస, రక్తపాతాలు ఓ రేంజ్‌లో ఉంటాయి.తలలు ఎగిరిపడుతుంటాయి, వాటిని వెదుక్కునేందుకు ప్రతినాయక బ్యార్ పరుగులు పెడుతుంటుంది. రంగస్థలంలాంటి సినిమా చేశాక రామ్‌చరణ్ ఇలాంటి సన్నివేశాల్ని నమ్మి చేయడం ఆశ్చర్యం కలిగించకమానదు. హీరో పెద్దన్నయ్య ఎలక్షన్ కమిషన్‌గా పనిచేస్తే ఆయన ముగ్గురు తమ్ముళ్లు బాడీగార్డ్‌లాగా ఎప్పుడూ వెనకాలే ఉంటారు. అసలు అదెలా సాధ్యం? పోనీ వాళ్లు కూడా అధికారులే అనుకొన్నా అన్నతోపాటే విధులు నిర్వర్తించే అవకాశం ఎప్పుడూ ఉంటుందా?
గుజరాత్‌లో ఉన్న హీరో విమానంలో బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు అన్న నుంచి ఫోన్ రాగానే, ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికొచ్చి బిహార్ రైలు ఎక్కుతాడు? అక్కడ్నుంచి గుర్రం ద్వారా విలన్ల దగ్గరికి చేరుకుంటాడు. అంటే హీరో వచ్చేవరకు వాళ్లంతా కదలకుండా మెదలకుండా అలాగే ఉంటారన్నమాట. ఇలా లాజిక్‌లేని విషయాలు సినిమా నిండా కనిపిస్తాయి. ప్రథమార్థంలో హేమ, పృథ్వీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలే కాస్త కాలక్షేపాన్నిస్తాయి మినహా ఈ సినిమాలో విషయమేమీ లేదు.
సాంకేతిక వర్గం...
సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులే పడతాయి. కెమెరా, ఆర్ట్ విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం పర్వాలేదనిపిస్తుందంతే. నిర్మాణ విలువలు మాత్రం రిచ్‌గా ఉంటాయి. బోయపాటి శ్రీను తన శైలికి తగ్గట్టుగానే కథని రాసుకొన్నాడు కానీ... ఇదివరకటి సినిమాల్లో పండినట్టుగా ఎమోషన్స్ పండకపోవడంతో తన ప్రయత్నమంతా వృథా అయ్యింది. కథలో బలం లేకపోవడమే అందుకు కారణం.
* ప్లస్ పాయింట్స్
+ రామ్‌చరణ్ డ్యాన్సులు, ఫైట్లు
+ నిర్మాణ విలువలు
+ ప్రథమార్థంలో కొన్ని కామెడీ సీన్స్
* మైనస్ పాయింట్స్
- కథ, కథనాలు
- మితిమీరిన రక్తపాతం
- లాజిక్ లేని పాత్రలు, సన్నివేశాలు
- భావోద్వేగాలు పండకపోవడం
పైనల్ వర్డిక్ట్: కథని విడిచి సాము చేసిన ప్రయత్నమిది. కమర్షియల్ సినిమాలకి కథల్లో భావోద్వేగాలు కీలకం. అవి పండకపోతే సినిమా ఎంత దారుణంగా ఉంటుందో చాటి చెప్పే మరో చిత్రమిది.
రివ్యూ రాసింది శ్రీ.