అన్నిసినిమాలూ ఒకేలా ఉండవు. కొన్ని డబ్బులు తెస్తాయి. ఇంకొన్ని డబ్బులు పోగొడతాయి. కొన్ని కొత్త అవకాశాలు సృష్టిస్తాయి. ఇంకొన్ని ఉన్న అవకాశాలు రాకుండా చేస్తాయి. అతి కొద్ది సినిమాలు మాత్రమే.. కొత్త ఆలోచనలకు పునాది వేస్తాయి. విమర్శకుల చేత సెభాష్ అనిపిస్తాయి. ఈ యేడాది విమర్శకుల మెప్పు పొందిన సినిమాలు చాలానే కనిపిస్తాయి. రంగస్థలం, మహానటి, కంచరపాలెం, గూఢచారి.. ఇవన్నీ విమర్శకుల మెప్పు పొందినవే. అయితే... వీటిలో కమర్షియల్ యాంగిల్ కూడా కనిపిస్తుంది. కేవలం క్రిటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో... సాగి, వాళ్ల మెప్పు పొందిన చిత్రం ఏమిటంటే 'అ' గుర్తొస్తుంది.
ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అయిన చిత్రమిది. నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరించడంతో ఈ సినిమాకి పబ్లిసిటీ పరంగా ఉపయోగపడింది. కాజల్, నిత్యమేనన్‌లాంటి పేరున్న కథానాయికలు కనిపించడంతో... ఈ సినిమాకి పోస్టర్ వాల్యూ యాడ్ అయ్యింది. అయితే ఇది పూర్తిగా అవుటాఫ్ ది బాక్స్ కి చెందిన ఐడియా. ఓ వ్యక్తి ప్రయాణాన్ని వివిధ పాత్రల ద్వారా చూపించి.. అంతర్లీనంగా ఓ కథ చెప్పడం.. కొత్త ఆలోచన. క్లైమాక్స్ వరకూ దాన్ని దాచి పెట్టి దర్శకుడు థ్రిల్‌కి గురిచేశాడు.
టెక్నికల్‌గా ఈ సినిమా ఉన్నతంగా కనిపించింది. నటీనటుల ప్రతిభ కూడా కలిసొచ్చింది. స్క్రీన్ ప్లేలో కొత్త పుంతలు తొక్కించిన ఈ సినిమా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా వసూళ్ల సంగతి పక్కన పెడితే.. రేటింగులు బాగా వచ్చాయి. కొన్ని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకూ 'అ' ఎంపికైంది. ఈ సినిమా తరవాత వచ్చిన `కంచెర పాలెం` కూడా `అ` తరహా స్క్రీన్ ప్లేతో సాగిన సినిమానే.
రీక్యాప్ 2018, ఐక్లిక్ మూవీస్ (iQlikmovies)