`విట‌మిన్ షి` మూవీ రివ్యూ & రేటింగ్

By iQlikMovies - December 29, 2020 - 12:04 PM IST

మరిన్ని వార్తలు

నటీనటులు : శ్రీకాంత్ గుర్రం, ప్రాచి థాకర్, వికాస్, రంజిత్ రెడ్డి తదితరులు 
దర్శకత్వం : జయశంకర్
నిర్మాత‌లు : రవి పోలిశెట్టి 
సంగీతం : పివిఆర్ రాజా 
సినిమాటోగ్రఫర్ : శివ శంకర్ వర ప్రసాద్

ఎడిటర్: నాని లుక్క


రేటింగ్: 3/5


టెక్నాల‌జీ అనేది మ‌నం మ‌న కోసం క‌నిపెట్టింది. మ‌న ప‌నిని సుల‌భం చేయ‌డానికి టెక్నాల‌జీని వాడుకోవాల్సిందే. టెక్నాల‌జీ అనేది ఎప్పుడూ మ‌న చేతుల్లోనే ఉండాలి. మ‌నం దాని చేతుల్లోకి వెళ్ల‌కూడ‌దు. వాటికి బాసిస‌గా మార‌కూడ‌దు. అలా మారుతున్నందువ‌ల్లే.... మ‌నిషికీ మ‌నిషికీ మ‌ధ్య దూరం పెరుగుతోంది. సెల్ ఫోన్ల‌కు అతుక్కుపోయి... హ్యూమ‌న్‌రిలేష‌న్స్ అనేవి మ‌ర్చిపోతున్నాం. ఈ పాయింట్ పైకొన్ని సినిమాలొచ్చాయి. ఒక్కో క‌థా.. ఒక్కో కోణాన్ని ప‌రిచ‌యం చేసింది. ఈ సెల్ ఫోన్ ఫోబియా..కి ల‌వ్ అండ్ రొమాంటిక్ యాంగిల్ జోడిస్తే.. అదే విట‌మిన్ షి.  లాక్ డౌన్ కాలంలో... అతి త‌క్కువ మంది టీమ్‌తో..రూపొందిన సినిమా ఇది. ఓ ర‌కంగా ప్ర‌యోగం అనుకోవాలి. ఇప్పుడు ఓటీటీ వేదిక‌లోకి వ‌చ్చేసింది. మ‌రి ఈ విట‌మిన్ షి ఎలా ఉంది..?  ఏమీ దీని క‌థ‌..?


* క‌థ‌


లియోకి సెల్ ఫోన్ ఆరో ప్రాణం. అది లేకుండా ఒక్క క్ష‌ణం కూడా ఉండ‌లేడు. ఓర‌కంగా తాను సెల్‌ఫోన్ కి బాసిన అయిపోతాడు. త‌న ఆఫీస్ లో ప‌నిచేసే వైదేహి అంటే చాలా ఇష్టం. కానీ వైదేహీ మాత్రం లియోని అస్స‌లు ప‌ట్టించుకోదు. లియో ఓ కొత్త ఫోన్ కొంటాడు. అందులో.. లైలా అనే వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. లియోకి ఏం కావాల‌న్నా.. ఎలాంటి స‌మాచారం అందాల‌న్నా.. క్ష‌ణాల్లో ఇచ్చేస్తుంది లైలా. అంతేకాదు... త‌న‌ని అన్ని విధాలా గైడ్ చేస్తుంది. ఓ స్నేహితురాలిగా మారిపోతుంది. లైలా స‌ల‌హాల వ‌ల్లే... వైదేహికి ద‌గ్గ‌ర‌వుతాడు లియో. లియో... వైదేహీ ద‌గ్గ‌ర అవ్వ‌డానికి లైలానే కార‌ణం. అలాంటి లైలా... లియో ప్రేమ‌లో ప‌డుతుంది.  ఆ త‌ర‌వాత ఏమైంద‌న్న‌దే క‌థ‌.


* విశ్లేష‌ణ‌


సెల్‌ఫోన్ లోని వాయిస్ అసిస్టెంట్ మ‌నిషి ప్రేమ‌లో ప‌డ‌డం.. ఓ కొత్త కాన్సెప్ట్‌. సిరి, అలెక్సాలా.. లైలా అనే పాత్ర‌ని సృష్టించాడు ద‌ర్శ‌కుడు. మామూలు మ‌నిషిలానే.. మాట్లాడ‌డం, ఆలోచించ‌డం.. లైలా ప్ర‌త్యేక‌త‌. కాబ‌ట్టి... ఈ క‌థ‌లో లైలా ఓ పాత్ర‌లా మారిపోయింది. నిజానికి ఈ పాయింట్ తో ఎంత పెద్ద సినిమా అయినా తీయొచ్చు. రోబో లా. కానీ.. ఇక్క‌డ బ‌డ్జెట్ ప‌రిమితులున్నాయి. ఆ క‌థ‌ని.. ఓ ప్రేమ‌క‌థ కోణంలో చూపించ‌డం బాగుంది.

 

సెల్ ఫోన్‌కి బాసిన అయిపోయిన క‌థానాయ‌కుడికి.. లైలా అనే వాయిస్ అసిస్టెంట్ తో ప‌రిచ‌యం, స్నేహం క‌ల‌గ‌డం.. హీరో, హీరోయిన్లు ప్రేమ‌లో ప‌డ‌డానికి లైలా ఓ కార‌ణం కావ‌డం.. బాగున్నాయి. లైలాకీ లియోకి మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ‌లు, వాళ్ల చ‌ర్చ‌ల్లో.. ద‌ర్శ‌కుడి థాట్స్ క‌నిపిస్తాయి. గెలుపు, బాధ‌, కోపం, ప్రేమ‌.. వీటికి లైలా ఇచ్చే నిర్వ‌చ‌నాలు బాగున్నాయి. ఈ పాయింట్స్ అన్నీ ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల‌కు చెప్పాల‌నుకున్న అంశాల‌ని భావించాల్సివుంటుంది.


చూస్తే... లియోలాంటి వాళ్లు క‌ళ్ల ముందు చాలామంది ఉంటారు. బ‌హుశా మ‌నం కూడా లియోలానే ప్ర‌వర్తిస్తుంటాం. ఎప్పుడూ సెల్ ఫోన్ చేతులో ప‌ట్టుకుని తిరిగేస్తుంటాం. అలాంటి వాళ్ల‌కు లియో ఓ ఐడెంటిఫై అనుకోవాలి. నిజంగానే లైలా అనే వాయిస్ అసిస్టెంట్ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. భ‌విష్య‌త్తులో అలాంటి టెక్నాల‌జీ వ‌స్తుందేమో చూడాలి. ఎమోష‌న్స్ అనేవి మ‌నిషి సృష్టించే వ‌స్తువుల‌కూ వ‌స్తే... కొన్ని ఉప‌యోగాలున్నాయి. ఇంకొన్ని ప్ర‌మాదాలూ ఉన్నాయి. లైలా.. లియో ప్రేమ‌లో ప‌డ‌డం అలాంటిదే. మ‌న స‌మాచారం అంతా... ఇంట‌ర్నెట్ లో పెట్టేస్తున్నాం.

 

మ‌న‌పై గాడ్జెట్స్‌కి కోపం వ‌స్తే... మ‌నం ఉండం అన్న విష‌యాన్నీ ద‌ర్శ‌కుడు చూచాయిగా చెప్పిన‌ట్టు అనిపించింది. లియో - వైదేహీల ట్రాక్ చాలా సున్నితంగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. కావాలంటే క్లైమాక్స్‌లో ఓవ‌ర్ మెలోడ్రామా పెట్టి, క‌న్‌ఫ్యూజ్ సృష్టించొచ్చు. కానీ ద‌ర్శకుడు దాని జోలికి వెళ్ల‌కుండా... సినిమాని వీలైనంత సాఫ్ట్ గా ముగించాల‌ని చూశాడు. సెక్స్‌కి సంబంధించిన స‌న్నివేశాలు, సంభాష‌ణ‌లు కొంత ఇబ్బంది క‌లిగిస్తాయి కానీ, ఇంకెక్కా ఫ్లో కి అడ్డురాదు. ఛార్జ‌ర్ పిన్ పెట్టి తీస్తున్న‌ప్పుడు వాయిస్ అసిస్టెంట్ దాన్ని సెక్స్ లా ఫీల‌వ్వ‌డం... కొంచెం అతిగా అనిపిస్తుంది.


* న‌టీన‌టులు


చాలా త‌క్కువ పాత్ర‌ల మ‌ధ్య న‌డిచిన క‌థ ఇది. లియో, వైదేహీల‌కే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది. ఆ త‌ర‌వాత‌.. లైలాది. ఆ పాత్ర క‌నిపించ‌దు గానీ, ఎక్కువ‌గా వినిపిస్తూ తాను కూడా ఓ పాత్ర‌గా మారిపోయింది.  ఓ ర‌కంగా.. లియో, వైదేహిల కంటే.. లియో - లైలాలా కెమిస్ట్రీనే బాగా పండింది. లియో బాయ్ నెక్ట్స్ డోర్ లా ఉన్నాడు. అంతే స‌హ‌జంగా న‌టించాడు. వైదేహి.. కార్పొరేట్ లైప్ స్టైల్ కి బాగా అల‌వాటు ప‌డిపోయిన అమ్మాయి పాత్ర‌లో ఇమిడిపోయింది. చాలా హుందాగా క‌నిపించింది.

 

* సాంకేతికత‌


లాక్ డౌన్ స‌మ‌యంలో, అతి త‌క్కువ ప‌రిమితులు, బ‌డ్జెట్ ప‌రిధుల మ‌ధ్య సినిమా తీయ‌డం మామూలు విష‌యం కాదు. అందులోనూ పూర్తిగా కొత్త న‌టీన‌టులు, టెక్నీషియ‌ల‌న్ల‌తో. అందులోనూ ఓ కొత్త కాన్సెప్టుతో. ఈ విష‌యంలో నిర్మాత‌ల ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఓ కొత్త కాన్సెప్ట్ ని సింపుల్ గా, అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా తీశారు. టెక్నాల‌జీకి ఎంత బానిస‌లుగా మారుతున్నారో చూపిస్తూ - ఓ సున్నిత‌మైన హెచ్చ‌రిక చేశారు. త‌క్కువ పాత్ర‌లు, త‌క్కువ లొకేష‌న్ల‌తో సాగే సినిమా ఇది. అయినా బోర్ కొట్ట‌దు. దాదాపు 70 నిమిషాల నిడివి ఉంది. ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ అనుకోవొచ్చు. పాట‌లూ, అన‌వ‌స‌ర‌మైన ట్రాకులూ వాడ‌కుండా.. క‌థ‌ని మాత్ర‌మే చెప్పారు. బ్యాక్‌గ్రౌండ్ లో వినిపించే రెండు పాట‌లూ బాగున్నాయి. ఫొటోగ్ర‌ఫీ నీట్ గా ఉంది. సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకున్నాయి, ఆలోచింప‌జేశాయి.


* ప్ల‌స్ పాయింట్స్‌

లైలా
నిడివి
చెప్పాల‌నుకున్న పాయింట్‌


* మైన‌స్ పాయింట్స్‌

కొన్ని ఓవ‌ర్ డోస్ సంభాష‌ణ‌లు

 

ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: విట‌మిన్ టీపీ (టైమ్ పాస్‌)


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS