బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినవాళ్లకు రెడ్ కార్పేట్ వేసి స్వాగతం పలుకుతోంది చిత్రసీమ. సోహైల్ అప్పుడే హీరో అయిపోయాడు. దివికి కూడా ఛాన్సులు వస్తున్నాయి. అవినాష్ కి కామెడీ పాత్రలు వరుస కడుతున్నాయి. ఇప్పుడు మోనాల్ గజ్జర్ వంతు వచ్చింది. ఇది వరకు కొన్ని సినిమాలు చేసినా.. మోనాల్ కి సరైన బ్రేక్ దొరకలేదు. బిగ్ బాస్ తరవాత... మోనాల్ క్రేజ్ కాస్త పెరిగింది. దాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడిపోయింది మోనాల్.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా `అల్లుడు అదుర్స్` సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంతోష్ శ్రీన్ వాస్ దర్శకుడు. అనూఇమ్మానియేల్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో ఓ ఐటెమ్ సాంగ్ కోసం మోనాల్ గజ్జర్ ని సంప్రదించింది చిత్రబృందం. ఈ పాటలో నటించడానికి మోనాల్ కూడా ఒప్పుకుంది. సోమవారం నుంచి ఈ పాట షూటింగ్ కూడా మొదలైపోయింది. 3 రోజుల పాటు ఈ పాటని తెరకెక్కించబోతున్నారు. ఈ పాట కోసం మోనాల్ 15 లక్షలు డిమాండ్ చేసిందని సమాచారం. ఇది వరకు మోనాల్ సినిమా మొత్తం చేసినా 10 లక్షలు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఒక్క పాటకే 15 లక్షలు తీసుకుంటోంది. ఇదంతా బిగ్ బాస్ పుణ్యమే కదూ.