తారగాణం: చిరంజీవి, రవి తేజ, శృతి హాసన్ తదితరులు
దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాణం: మైత్రి మూవీ మేకర్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: ఆర్థర్ విల్సన్
ఎడిటర్: చోట కే ప్రసాద్
రేటింగ్: 2.5/5
దశాబ్దాలుగా మాస్‌ని అలరిస్తున్న స్టార్... మెగా స్టార్. మాస్ ని ఎలా మెప్పించాలో చిరంజీవికి బాగా తెలుసు. ఆయన అభిమానుల్ని ఖుషీ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర మంచి విజయాల్ని అందుకొన్నాయి. అందుకే చిరు దర్శకుల ఫోకస్ కూడా మెగా ఫ్యాన్స్ పైనే ఉంటుంది. వాళ్లకు కావల్సిన జోష్ ఇచ్చేస్తే... సినిమాకు మినిమం గ్యారెంటీ అంటూ దొరికేస్తుంది. ఈమధ్య చిరు సినిమాల్లో.. చిరు నుంచి ఆశించే కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా తగ్గిపోయాయి. అందుకే.. చిరు వాటిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి తనకు రెడీమెడ్ గా సూటైపోయే ఓ కథని ఎంచుకొన్నాడు. అదే... వాల్తేరు వీరయ్య. ఈ చిత్రానికి చిరు వీరాభిమాని బాబి దర్శకుడు కావడం, చిరు అంటే అమితంగా ఇష్టపడే రవితేజ ఓ కీలక పాత్ర పోషించడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. మరి ఈ పెరిగిన అంచనాల్ని వాల్తేరు వీరయ్య అందుకొన్నాడా? చిరు నుంచి ఆశించే ఎలిమెంట్స్ ఈ వీరయ్యలో ఏమున్నాయి?
* కథ
సాల్మాన్ (బాబీ సింహా) ఓ మాన్‌స్టర్. తనని కస్టడీలో ఉంచినందుకు పోలీసుల్ని ఊచకోత కోసి మలేసియా పరారవుతాడు. ఇదే ఘటనలో సీఐ సీతాపతి (రాజేంద్ర ప్రసాద్) సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సరే.. సాల్మాన్‌ని పట్టుకొని పోలీసులకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలన్నది సీతాపతి తపన. ఈ విషయంల డిపార్ట్‌మెంట్ తనకు సహకరించదు. అందుకే లోకల్ స్మగ్లర్ వాల్తేరు వీరయ్య (చిరంజీవి) సహాయం కోరతాడు. పాతిక లక్షల కోసం.. సాల్మన్ ని పట్టుకోవడానికి మలేసియా వెళ్తాడు. మరి వీరయ్య సాల్మన్ ని పట్టుకొన్నాడా? సాల్మన్ సోదరుడు కాలా (ప్రకాష్ రాజ్) తో వీరయ్యకు ఉన్న శత్రుత్వం ఏమిటి? విక్రమ్ సాగర్ (రవితేజ) వీరయ్యకు ఏమవుతాడు? అనేది తెరపై చూడాలి.
* విశ్లేషణ
కేవలం చిరంజీవి ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొని అల్లుకొన్న కథ ఇది. ఓ ముక్కలో చెప్పాలంటే... తమ్ముడి లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్న చేసే ప్రయాణం. తమ్ముడి మరణానికి ఓ అన్న తీర్చుకొన్న ప్రతీకారం. ఈ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. వాటికీ, వాల్తేరుకి ఉన్న తేడా.. చిరంజీవి మాత్రమే. చిరులోని మాస్ కోణాన్నీ, కామెడీ యాంగిల్ నీ అభిమానులు చూసి చాలా రోజులైంది. వాటిని పండించడానికి వీరయ్యలాంటి వేదిక దొరికింది. చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్ దగ్గర్నుంచి, లవ్ ట్రాక్, మలేసియాలో ఇంట్రవెల్ ఫైట్.. ఇవన్నీ పక్కగా అభిమానుల్ని ఉద్దేశించి డిజైన్ చేసుకొన్నవే. అవన్నీ అలరిస్తాయి. కామెడీ సీన్లు సిల్లీగా ఉన్నా సరే.. వాటికి చిరంజీవి టైమింగ్, గ్రేస్ తోడవ్వడంతో పాస్ అయిపోతాయి. ఇంట్రవెలల్ బ్యాంగ్ అయితే దర్శకుడు బాబి చెప్పినట్టు నిజంగానే పూనకాలు తెప్పిస్తుంది. అక్కడ గ్యాంగ్ లీడర్ రిఫరెన్సు వాడుకొన్నాడు బాబి. జగదేక వీరుడు - అతిలోక సుందరిలోని అబ్బనీ తీయని దెబ్బ పాట, ముఠామేస్త్రీ గెటప్.. ఇలాంటి రిఫరెన్సులు అభిమానులకు నచ్చుతాయి.
దాంతో సెకండాఫ్ పై అంచనాలు మరింత పెరుగుతాయి. అప్పటి వరకూ రవితేజ పాత్రని చూపించకపోవడం తో.. రవితేజ వచ్చాక కథ మరింత ముందుకు వెళ్తుంది అనుకొంటారు. అనుకొన్నట్టుగానే, సెకండాఫ్ మొదలవ్వడమే రవితేజ పాత్ర ఇంట్రో ఇచ్చేస్తుంది. అక్కడి నుంచి అన్నా దమ్ముల ఎపిసోడ్లకు శ్రీకారం చుడతారు. సవతి సోదరులకు ఒకరంటే ఒకరికి పడకపోవడం చాలా సినిమాల్లో చూసిందే. ఇక్కడా అదే తంతు. వీరయ్య పాత్రని మరీ సిల్లీగా తీర్చిదిద్దడం, విక్రమ్ (రవితేజ) పాత్రపై సరిగా ఫోకస్ లేకపోవడంతో ఆ సీన్లనీ తేలిపోతాయి. రొటీన్ డ్రగ్ దందా ఈ కథలో కాన్ఫిట్‌గా మారింది. అది సరిపోలేదు. సెకండాఫ్‌లో పూనకాలు లోడింగ్ తప్ప.. పాటల్ని పెట్టే స్కోప్ లేదు. దాంతో హుషారు తగ్గిపోతూ వస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో అన్నాదమ్ముల ఎమోషన్ చూపించే ప్రయత్నం చేశారు. అది కాస్త వర్కవుట్ అయ్యింది. క్లైమాక్స్ అత్యంత సాదా సీదాగా మారిపోయింది. అక్కడ చిరు గన్ పట్టుకోవడం చూస్తే కేజీఎఫ్ రిఫరెన్సులా అనిపిస్తుంది. `నే లుంగీ కట్టా చూడూ.. నే లుంగీ కట్టా చూడూ.. జంబలకడ జారు మిఠాయి` అంటూ చిరు పాడుకోవడం థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. దీన్నే రెండుసార్లు రిపీట్ చేశారు. అక్కడక్కడ చిరు కామెడీ టైమింగ్ , కాస్త సెంటిమెంట్ వర్కవుట్ అవ్వడంతో సెకండాఫ్ జస్ట్ గట్టెక్కుతుంది. అంతే.
* నటీనటులు
చిరంజీవికి ఇది అలవాటైన పాత్రే. హుషారుగా చేసుకొంటూ వెళ్లిపోయాడు. తనలోని కామెడీ యాంగిల్ ని బయటకు తీసుకొచ్చి చాలా రోజులైంది. చిరు టైమింగ్ మరోసారి అలరిస్తుంది. తెరపై అందంగానూ కనిపించాడు. గ్రేసీ స్టెప్పులు ఆకట్టుకొంటాయి. రవితేజ కోసం కొన్నిచోట్ల తన పాత్రని సైతం తగ్గించుకొన్నాడు.
రవితేజకి సైతం ఇది రొటీన్ పాత్రే. కానీ చిరంజీవితో కలిసి నటించడం వల్ల ఆయా సన్నివేశాలు ఎలివేట్ అయ్యాయి. శ్రుతి పాత్రని సినిమా ప్రారంభంలో బాగానే చూపించారు. కానీ సినిమా నడుస్తున్న కొద్దీ.. ఆ పాత్రకు మైలేజీ తగ్గిపోయి, పాటలకే పరిమితం అవుతుంది.
బాబీ సింహా, ప్రకాష్ రాజ్.. వీళ్ల క్యారెక్టర్ల నుంచి కూడా కొత్తదనం ఆశించలేం. కామెడీ గ్యాంగ్ పెద్దదే. కానీ.. నవ్వులు పంచింది మాత్రం ఒక్క వెన్నెల కిషోర్ మాత్రమే.
* సాంకేతిక నిపుణులు
దేవిశ్రీ పాటలు బాగున్నాయి. ఆర్.ఆర్‌లోనూ ఓకే అనిపిస్తాడు. ఇంట్రవెల్ బ్యాంగ్ లో వచ్చే పాట మంచి హై ఇస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఫొటోగ్రఫీ రిచ్ గా ఉంది. పాటల్లో హీరో, హీరోయిన్లని చాలా అందంగా చూపించారు. బాబీ చాలా సాదా సీదా కథ ఎంచుకొన్నాడు.
చిరంజీవికి చాలా చిన్న కథ ఇది. అందులోనూ రవితేజ కూడా ఉన్నాడు. కేవలం ఫ్యాన్ మూమెంట్స్ పై ఆధారపడిపోయి తీసిన సినిమా ఇది. వాళ్లకు పూనకాలు వస్తాయి. కానీ మిగిలిన వాళ్ల మాటేమిటి?
సినిమా అంటే కేవలం అభిమానుల కోసమే కాదు కదా? ఈ విషయాన్ని బాబీ మర్చిపోయాడు.
* ప్లస్ పాయింట్స్
చిరంజీవి
ఇంట్రవెల్
పాటలు
ఫైట్లు
* మైనస్ పాయింట్స్
కథ
కథనం
క్లైమాక్స్
* ఫైనల్ వర్టిక్ట్ : పూనకాలు.. నీరసాలు