Wanted Pandugod Review: వాంటెడ్‌ పండుగాడ్ మూవీ రివ్యూ & రేటింగ్!

By iQlikMovies - August 19, 2022 - 18:49 PM IST

మరిన్ని వార్తలు

నటీనటులు: సునీల్, సుధీర్, దీపికా పిల్లి, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, తనికెళ్ల భరణి, షకలక శంకర్
దర్శకత్వం : శ్రీధర్ సీపాన
నిర్మాత: వెంకట్ కోవెలమూడి
సంగీత దర్శకుడు: జనార్ధన మహర్షి
సినిమాటోగ్రఫీ: మహి రెడ్డి పండుగల
ఎడిటర్: తమ్మిరాజు


రేటింగ్ : 1/5


కె.రాఘ‌వేంద్రరావు తీసిన పెళ్లి సందడి సూపర్ హిట్. ఈ సినిమాకి ఒక ప్రత్యేకత వుంది. టాలీవుడ్ లో వున్న దాదాపు అందరు కమెడియన్లు ఇందులో కనిపిస్తారు. ఇదే టైటిల్ తో ఆ మధ్య 'పెళ్లి సంద‌D' అనే సినిమాని తన దర్శకత్వ పర్వవేక్షణలో చేసి మంచి విజయాన్ని సాధించారు రాఘ‌వేంద్రరావు. ఇప్పుడు ఆ సినిమాలో వున్న కామెడీ గ్యాంగ్ పాయింట్ తో తన నిర్మాణ సారధ్యంలో ఒక సినిమా తీశారు. అదే..వాంటెడ్‌ పండుగాడ్. టాలీవుడ్ లో వున్న దాదాపు అందరు కమెడియన్లని, అలాగే జబర్దస్త్ గ్యాంగ్ ని కూడా కలుపుకొని ఎటూ చూసిన కామెడీ మొహాలతోనే పోస్టర్ ని నింపేసి పండుగాడ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఒక్కసారి ఈ కామెడీ గ్యాంగ్ కథలోకి వెళితే..


కథ:


పాండు (సునీల్) చంచల్ కూడా జైలులో జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. జైలు నుంచి త‌ప్పించుకొని... న‌ర‌సాపూర్ అట‌వీ ప్రాంతంలో దాక్కుంటాడు. అతనిని పట్టుకుంటే కోటి రూపాయల నజరానా ప్రకటిస్తుంది డిపార్ట్మెంట్. దాంతో... కొంత‌మంది పండుగాడ్ని ప‌ట్టుకొని, ఆ కోటి సంపాదించాల‌న్న లక్ష్యంతో అడ‌విలోకి వెళతారు. వీళ్లంద‌రికీ డ‌బ్బు అవ‌స‌రం. అయితే వీళ్ల‌లో సి పాండుని పట్టుకొన్న‌ది ఎవ‌రు? ఆ కోటి ఎవ‌రికి ద‌క్కింది? అనేది మిగిలిన క‌థ‌.


విశ్లేషణ:


కామెడీ ఎవర్ గ్రీన్. హాయిగా నవ్వుకోవడానికి అందరూ సిద్ధంగా వుంటారు. ఆ పాయింట్ ని బలంగా నమ్మి తెరపై మొత్తం కమెడియన్లతో నింపి పండుగాడ్ ని రెడీ చేశారు. బ్రహ్మానందం, సునీల్, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్, రఘుబాబు, సుధీర్, షకలక శంకర్, హేమ, కరాటే కళ్యాణి.. ఇలా దాదాపు తారాగణమంతా హాస్యగణమే. అయితే పులిహోరలో పులి వుండనట్లే.. ఇంతమంది కమెడియన్లు తెరపై కనిపించిన ఈ సినిమాలో కామెడీ మాత్రం భూతద్దం వేసి వెదికినా దొరకదు.


ఈ సినిమాకి కథని అందించిన జనార్ధన మహర్షి మంచి కథకుడు. ఆయన ఏం కథ ఇచ్చాడో కానీ దర్శకుడు శ్రీధర్ సీపాన మాత్రం ఈ మొత్తం చిత్రాన్ని పేలని జబర్దస్త్ స్కిట్ లా తీశారు. తెరపై సన్నివేశాలు. పాత్రలు అలా సాగిపోతుంటాయి కానీ ఒక్కటి యంగేజింగా వుండదు. పైగా చాలా సందర్భాల్లో ముతక కామెడీ అనే భావన కలిగిస్తాయి. బ్రహ్మానందంతో చేసిన ట్రాక్ ఆయన లాంటి హాస్య దిగ్గజానికి ఈ వయసులో అనవసరం అనిపిస్తుంది. ఆయన కూడా రాఘ‌వేంద్రరావు పై ప్రేమతో నటించడానికి ఒప్పుకున్నట్లు వుంటుంది కానీ అందులో వెగటు తప్పితే హాస్యం లేదు. 


సినిమా కథకి కొన్ని లక్షణాలు వుంటాయి. ఒక పాయింట్ అనుకున్నపుడు దాని చుట్టూ కథనం నదపాలి. బేసిక్ రూలు ఇది. కానీ ఇందులో మాత్రం ప్రతి కమెడియన్ కి పాత్ర పరిచయానికి ఒక సోది ఇంట్రో ఇచ్చి తలనొప్పి తెప్పించి.., తాడు బొంగరం లేని కథగా విసుగు వెగటు పుట్టించారు. ఒక పాత్రకీ బలమైన నిర్మాణం వుండదు. జబర్దస్త్ టైపులో యాంకర్ తో అక్కడి నటులు దించి నాలుగు వెకిలి డైలాగులతో నవ్వించాలనే ప్రయత్నం దెబ్బకొట్టింది. జబర్దస్త్ గ్యాంగ్ అంతా తేలిపోయింది. వాళ్ళు చేసే కామెడీకి నవ్వురావాలంటే.. డియో సైదులు సౌండ్ ఎఫెక్ట్లు వేసుకోవాలేమో. ఈ సినిమా మొత్తంలో రాఘ‌వేంద్రరావు స్టయిల్ లో తీసిన అబ్బబ్బా పాట మాత్రం చూడబుల్ గా వుంటుంది. ప‌తాక స‌న్నివేశాలు మ‌రీ చుట్టేసిన‌ట్టు అనిపిస్తాయి.


నటీనటులు:


సునీల్ పై ఓపెన్ చేసిన కథ ఇది. అయితే ఆయన మాత్రం ఓ మూడుసార్లే కనిపిస్తాడు. బ్రహ్మానందం ట్రాక్ నవ్వు తెప్పించలేకపోయింది. వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి పాత్రలు కూడా వర్క్ అవుట్ కాలేదు.


అనసూయ, సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి, రఘు బాబు, అనంత్, పుష్పా జగదీష్, నిత్యా శెట్టి, వాసంతి, విష్ణుప్రియ, హేమ, షకలక నామమాత్రంగానే వున్నారు. అన‌సూయ‌కు ఓ పాట కూడా పెట్టారు. అయితే అదెమంత ఎఫెక్టీవ్‌గా క‌నిపించ‌దు.


భ‌ర‌ణి - అమ‌ని ట్రాక్ అయితే... అత్యంత విసుగ్గా ఉంది. మేక‌ప్ తీసేస్తే.. పులి కూడా భ‌య‌ప‌డి పారిపోవ‌డం... జ‌బ‌ర్‌ద‌స్త్ టైపు కామెడీ సీన్ల‌కు ఓ మ‌చ్చుతున‌క‌.


సాంకేతిక వర్గం:


 సాంకేతికంగా సినిమా ట్రెండ్ తగ్గట్టు వుండదు. సాంగ్స్, బీజీఎమ్ ఆకట్టుకోవు. నిర్మాణ విలువలు ఉన్నతంగా లేవు. చాలా సన్నివేశాల‌లు నాన్ సింక్ లో వుంటాయి. కంటిన్యుటీ లోపాలు కూడా వున్నాయి.


జ‌నార్థ‌న మ‌హ‌ర్షి క‌థ విష‌యంలో ఏమాత్రం క‌స‌ర‌త్తు చేయ‌లేద‌ని అర్థ‌మైపోతుంది. రాత అలా ఉంటే.. తీత అంత‌కంటే దారుణంగా త‌యారైంది. ఎక్క‌డా క్వాలిటీ లేదు.


* ప్లస్ పాయింట్స్ 


అబ్బబ్బా పాట 


* మైనస్ పాయింట్స్ 


బలహీనమైన కథ, కథనం 
కామెడీ మిస్ ఫైర్ 


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్: పండు'గాడ్' కూడా కాపాడలేడు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS