'విజిల్‌' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: విజ‌య్‌, న‌య‌న‌తార‌, జాకీష్రాఫ్‌, వివేక్‌ త‌దిత‌రులు
దర్శకత్వం: అట్లీ
నిర్మాణం:  ఏజీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ 
సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
సినిమాటోగ్రఫర్: జి.కె.విష్ణు
విడుదల తేదీ: అక్టోబర్ 25,  2019

 

రేటింగ్‌: 2.75/5

 
హీరో ఒక ఫైట్‌లో సైకిల్ ఛైన్ అందుకుంటాడు క‌మెడియ‌న్ వ‌చ్చి `అది పాతదే గురూ` అంటాడు పాత‌దే కానీ... మిన‌మ‌మ్ గ్యారెంటీ అంటూ ఛైన్ చేతికి చుట్టేసుకొని ఫైట్ చేసేస్తాడు. ఆ డైలాగ్‌కి త‌గ్గ‌ట్టుగానే ద‌ర్శ‌కుడు అట్లీ మినిమ‌మ్ గ్యారెంటీ మాస్ అంశాల్ని మ‌న‌సులో పెట్టుకొనే `విజిల్‌` కొట్టాడు.  విజ‌య్‌లాంటి స్టార్‌తో సినిమా చేసేట‌ప్ప‌డు అలా ఆలోచింక త‌ప్ప‌ద‌నుకొన్నాడేమో. అయితే సినిమా మొత్తం అదే ఉంటే... రొటీన్ మాస్ మ‌సాలా సినిమా అవుతుంది. అందుకే  ద్వితీయార్థంలో కొన్ని సోష‌ల్ ఎలిమెంట్స్‌ని స్పోర్ట్స్ డ్రామాతో ముడిపెట్టి అట్లీ మార్క్‌ని చూపెట్టాడు.  ఈ సినిమాకి `విజిల్` ఎక్కడెక్క‌డ ప‌డుతుందో తెలుసుకొనేముందు క‌థ‌లోకి వెళ‌దాం...

 

* క‌థ‌

 

మైఖేల్ అలియాస్ బిగిల్ (విజ‌య్‌) ఫుట్‌బాల్ ప్లేయ‌ర్. ఆయ‌న తండ్రి రాజ‌ప్ప (విజ‌య్‌) చెడ్డవాళ్ల భ‌ర‌తం ప‌ట్టే ఒక గ్యాంగ్‌స్ట‌ర్‌. త‌న కొడుకు, అత‌నితోపాటు ఆడుతున్న కుర్రాళ్లు జాతీయ స్థాయిలో ఆడి క‌ప్పు కొట్టాల‌నేది రాయ‌ప్ప క‌ల.  అందుకోసం ఎంత‌గానో ప్రోత్స‌హిస్తుంటాడు.  కానీ రాయ‌ప్ప ముఠా త‌గాదాల వ‌ల్ల బిగిల్ కెరీర్ అర్ధంత‌రంగా ముగుస్తుంది. ఏడేళ్ల త‌ర్వాత అవే ముఠా త‌గాదాలు బిగిల్‌ని న‌వ్యాంధ్ర మ‌హిళ‌ల ఫుట్‌బాల్ జ‌ట్టుకి కోచ్‌గా ప‌నిచేసే అవ‌కాశాన్ని తెచ్చిపెడ‌తాయి. మ‌రి బిగిల్ మ‌హిళ‌ల జ‌ట్టుని ఎలా న‌డిపించాడు?  త‌న తండ్రి క‌న్న క‌ల‌ని కోచ్‌గా ఎలా నెర‌వేర్చాడు?  ఫుట్‌బాల్ ఫెడ‌రేష‌న్ రాజ‌కీయాలపై బిగిల్ ఎలా పోరాటం చేశాడు? త‌దిత‌ర విష‌యాలతో మిగ‌తా సినిమా సాగుతుంది.
 

* న‌టీన‌టులు


విజ‌య్ ద్విపాత్రాభిన‌యం సినిమాకి హైలెట్ అని చెప్పొచ్చు. ఆయ‌న మేన‌రిజ‌మ్స్‌, న‌ట‌న, ఫైట్లు, డ్యాన్సులు ఆక‌ట్టుకునేలా ఉంటాయి. అభిమానుల‌ని దృష్టిలో ఉంచుకొని ప‌క్కాగా విజ‌య్ పాత్ర‌ని తీర్చిదిద్దారు. న‌య‌న‌తార  పాత్ర‌కి ప్రాధాన్యం త‌క్కువే. వివేక్‌, క‌దిర్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. జాకీష్రాఫ్ ఇందులో కీల‌క పాత్ర‌లో సంద‌డి చేస్తారు. ఆయ‌న పాత్ర‌ని మ‌రింత శ‌క్తివంతంగా తీర్చిదిద్దాల్సింది.  ఫుట్ బాల్ క్రీడాకారిణుల పాత్ర‌ల్లో డెప్త్ లేక‌పోయినా.. ఉన్నంత‌వ‌ర‌కు వాళ్లు కూడా బాగా న‌టించారు. 


* సాంకేతిక వ‌ర్గం


సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. విష్ణు కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతున్నప్పుడే ఎ.ఆర్‌.రెహ్మాన్ సంగీతం ప్ర‌భావం క‌నిపిస్తుంది. మిగిలిన స‌న్నివేశాలు సాదాసీదాగానే అనిపిస్తాయి. శివంగి పాట మాత్రం బాగుంది. సినిమా నిడివి మ‌రీ సుదీర్ఘంగా సాగుతుంది. దాంతో చాలా స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి. అట్లీ త‌న మార్క్‌తో క‌థ‌ని చెప్ప‌డం కంటే కూడా, విజ‌య్ ఇమేజ్‌నే ఎక్కువ‌గా దృష్టిలో పెట్టుకొని సినిమాని తీర్చిదిద్దాడు. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. అనువాద‌మే నాసిర‌కంగా అనిపిస్తుంది.

 

* విశ్లేష‌ణ‌

 

క్రీడా నేప‌థ్యంలో సినిమాలు కొత్తేమీ కాదు. త‌ర‌చూ వ‌స్తూనే ఉంటాయి. వాటిలో డ్రామా బాగా పండిందంటే ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేయొచ్చు.  బాక్సింగ్ ద‌గ్గ‌ర్నుంచి, క‌బ‌డ్డీ వ‌ర‌కు విజ‌య‌వంత‌మైన స్పోర్ట్స్ డ్రామాలు  చాలానే ఉన్నాయి. అయితే ఇటీవ‌ల కాలంలో ఫుట్‌బాల్ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాలు మాత్రం లేవు. స‌రికొత్త‌గా అనిపించే ఆ నేప‌థ్యాన్ని ఎంచుకొని బ‌ల‌మైన సోష‌ల్ ఎలిమెంట్స్‌ని స్పృశించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ముందు చెప్పిన‌ట్టుగా  ఒట్టి సోష‌ల్ ఎలిమెంట్స్‌నో లేదంటే,  స్పోర్ట్స్ డ్రామానే న‌మ్ముకోకుండా... వాటికి మినిమ‌మ్ గ్యారెంటీ క‌మ‌ర్షియ‌ల్ అంశాల్ని జోడించాడు. దాంతో అటు విజ‌య్ అభిమానుల‌కీ... ఇటు క‌థ‌, అందులో కొత్త‌ద‌నం కోరుకొనే ప్రేక్ష‌కుల‌కీ హోల్‌సేల్‌గా వినోదం పంచే ప్ర‌య‌త్నం చేశాడు.  

 

కాక‌పోతే ఫ‌స్ట్‌హాఫ్ మొత్తం విజ‌య్ చేసే మినిమ‌మ్ గ్యారెంటీ హంగామాని భ‌రించాల్సి వ‌స్తుంది. మూడు కోణాల్లో సాగే హీరో పాత్ర‌ల ఇంట్ర‌డ‌క్ష‌న్స్‌, ఆయ‌న మేన‌రిజ‌మ్స్‌, ఫైట్లు, వాటి త‌ర్వాత పాట‌లు.. ఇలా ఫ‌క్తు రొటీన్ మాస్ మ‌సాలా దినుసుల‌తోనే క‌థ‌ని న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. కాస్త‌లో కాస్త బిగిల్‌గా విజయ్ మైదానంలోకి అడుగుపెట్టి చేసే హంగామానే మెప్పిస్తుంది. అస‌లు క‌థ‌ని మాత్రం ద్వితీయార్థంలోనే మొద‌లుపెట్టారు. స‌హజంగా ఆట‌తోనే బోలెడ‌న్ని భావోద్వేగాల్ని పండేలా చేయొచ్చు. ఇక దానికి   వుమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్‌కి సంబంధించిన అంశాల్ని జోడించి వాటి ద్వారా కూడా భావోద్వేగాలు పండేలా చేశాడు. 

 

దాంతో  డ‌బుల్ డోస్ అయ్యింద‌న్న‌మాట‌. ఫుట్‌బాల్ ఫెడ‌రేష‌న్ రాజ‌కీయాలు మొద‌లుకొని... ఆట‌లో ఎత్తులు పైఎత్తులు, అమ్మాయిల‌పై జ‌రిగే అఘాయిత్యాలు ఇలా ఎన్నో అంశాల్ని స్పృశించాడు ద‌ర్శ‌కుడు. తొలి స‌గ‌భాగమంతా హీరోయిజం కోసం వాడుకుంటే...  ద్వితీయార్థాన్ని క‌థకోసం వాడుక‌న్నాడు ద‌ర్శ‌కుడు. ప‌తాక స‌న్నివేశాలు కూడా సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. రెండు పాత్ర‌ల్లో బోలెడంత హీరోయిజాన్ని చూపించే హీరో పాత్ర‌ల‌కి త‌గ్గ‌ట్టుగా, విల‌నిజం లేక‌పోవ‌డం సినిమాకి మైన‌స్‌గా మారింది.

 

* ప్ల‌స్ పాయింట్స్‌ 

కథ
మాస్ సీన్లు
సంగీతం


* మైన‌స్ పాయింట్స్

తమిళ ఫ్లేవర్ 
సాగదీత 
 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: తెలుగు ప్రేక్ష‌కులు 'విజిల్' కొట్టాలంటే మాత్రం ద్వితీయార్థం వ‌ర‌కు ఆగాల్సిందే.

 

- రివ్యూ రాసింది శ్రీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS