Writer Padmabhushan Review: రైటర్ పద్మభూషణ్ మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: సుహాస్, టీనా శిల్పారాజ్, గౌరీ ప్రియారెడ్డి, అశిష్ విద్యార్థి, రోహిణి తదితరులు
దర్శకుడు : షణ్ముక్ ప్రశాంత్
నిర్మాతలు: చంద్రు మనోహరన్
సంగీత దర్శకులు: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్ శాఖమూరి


రేటింగ్: 2.75/5


మిడిల్ క్లాస్ కథల్లో ఎప్పుడూ మ్యాజిక్ వుంటుంది. సరిగ్గా ప్రజంట్ చెయలేకానీ అందరూ కనెక్ట్ అయ్యే కథలివి. సుహాస్ కూడా పక్కింటి అబ్బాయే. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ సినిమాల్లోకి వచ్చాడు. చిన్న చిన్న పాత్రలు వేస్తూ కలర్ ఫోటో సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ గా వచ్చాడు. మరి ఈ రైటర్ ఎలాంటి వినోదాల్ని తెచ్చాడు ? ఇంతకీ ఈ రైటర్ కథ ఏమిటో చూద్దాం. 


కథ :


ప‌ద్మభూష‌ణ్ (సుహాస్‌) విజయవాడ ప్రాంతీయ లైబ్రరీలో.. లైబ్రేరియ‌న్‌గా ప‌ని చేస్తుంటాడు. భూషణ్ తండ్రి మధుసూధన్ (ఆశిష్ విద్యార్ధి) తల్లి సరస్వతి (రోహిణి). భూషణ్ కు పాపులర్ రైటర్ అని పిలిపించుకోవాల‌ని కల. `తొలి అడుగు` పేరుతో ఓ పుస్తకం రాస్తాడు. ఈ విష‌యం ఇంట్లో వాళ్లకీ, స్నేహితుల‌కి కూడా చెప్పడు. ఈ పుస్తకం కోసం 4 ల‌క్షలు అప్పు చేస్తాడు. కానీ.. ఆ పుస్తకం ఎవ‌రూ చ‌ద‌వ‌రు. బల‌వంతంగా చదివించాలానే భూషణ్ ప్రయ‌త్నాలూ బెడ‌సికొడుతుంటాయి.


అయితే ఇదే సమయంలో రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ పేరుతో ఓ న‌వ‌ల వ‌చ్చి పాపుల‌ర్ అయిపోతుంది. దాన్ని ప‌ద్మ‌భూష‌ణే రాశాడ‌ని న‌మ్మి... మేన‌మావ త‌న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయ‌డానికి రెడీ అయిపోతాడు. దీంతో ఎవ‌రో రాసిన పుస్త‌కానికి వ‌చ్చిన క్రెడిట్ త‌న పేరుమీద వేసుకోవ‌డానికి సిద్ధ ప‌డ‌తాడు భూషణ్. తర్వాత ఏం సరిగింది, అస‌లు రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ పేరుతో ర‌చ‌న‌లు చేస్తోంది ఎవ‌రు? భూషణ్ అసలు రచయిత కాదనే సంగతి ప్రపంచానికి తెలిసిందా ? అనేది మిగతా కథ.


విశ్లేషణ :


ఇదొక వర్ధమాన రచయిత కథ. దీనికి మిడిల్ క్లాస్ మేలోడిస్ తరహా టచ్ ఇచ్చి .. చివర్లో ఒక సందేశంతో వదిలారు. రైటర్ గా భూషణ్ కష్టాలు, ఇంట్లో తల్లితండ్రుల మిడిల్ క్లాస్ ముచ్చట్లు, మరదలితో ప్రేమ.. ఇవన్నీ భూషణ్ కు ఫన్ యాడ్ చేశాయి. పుస్త‌కాన్ని బ‌ల‌వ‌తంగా అంట‌గ‌ట్ట‌డం... సెలూన్‌లో లో ఫ్రండ్ తో సీన్లు... థియేట‌ర్లో సీన్‌ ఇవన్నీ సరదాగా గడిచిపోతాయి. రెండో పుస్తకం వచ్చిన తర్వాత అసలు భూషణ్ ఎవరనే ఆసక్తి ఏర్పడుతుంది. ఇంటర్వెల్ కూడా సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. 


సెకండ్ హాఫ్ భూషణ్ కు కొంత పరీక్షగా మారింది. సీన్లు అక్కడక్కడే తిరుగుతుంటాయి. కన్నా పాత్రలో సస్పెన్స్ ని క్రియేట్ చేయాలనే ప్రయత్నం పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ప్రీ క్లైమాక్స్ వరకూ సాగదీత ధోరణి కనిపిస్తుంది, అయితే చివర్లో దర్శకుడు చెప్పాలనుకునే పాయింట్ వస్తుంది. ఇంట్లో ఆడ‌పిల్ల‌ల్ని ` పెళ్లి ఎప్పుడు అని అడుగుతారు కానీ నువ్వేం కావాల‌నుకొంటున్నావ్‌` అని అడిగేవాళ్లు లేరు. ఈ పాయింట్ ని దర్శకుడు చివర్లో కన్విన్స్ చేసిన విధానం ఆకట్టుకుంది. ఒక ఫీల్ గుడ్ వైబ్ తో బయటికి వచ్చేలా చేస్తుంది.


నటీనటులు :


సుహాస్ మంచి నటుడు. భూషణ్ పాత్రని చాలా సహజంగా చేశాడు. తన కామెడీ టైమింగ్ బావుంది. టీనా ఓకే అనిపించింది. కన్నా పాత్రలో కనిపించిన గౌరీ పర్వాలేదు.


ఆశిష్ విద్యార్ధి, రోహిణీ పాత్రలు ఆకట్టుకున్నాయి. నటనలో వారి అనుభవం పాత్రలకు హుందాతనం తీసుకొచ్చాయి. గోపరాజు రమణతో పాటు మిగతా నటులు పరిధి మేర చేశారు, 


టెక్నిక‌ల్ :


నిర్మాణంలో పరిమితులు కనిపించినప్పటికీ సినిమా డీసెంట్ గా తీశారు. నీ కన్నుల్లో పాట బావుంది. కెమరాపనితనం నీట గా వుంది. మాట‌లు అక్క‌డ‌క్క‌డ న‌వ్విస్తాయి.


దర్శకుడు ప్రశాంత్ లో కొత్తగా ఏదైనా చెప్పాలనే ప్రయత్నం కనిపించింది. చాలా చోట్ల సాగదీతగా అనిపించినా మంచి సందేశంతో ఒక రైటర్ కథ చెప్పడం మంచి ప్రయత్నమే.


ప్లస్ పాయింట్స్


సుహాస్ 
కొన్ని కామెడీ సీన్లు 
సందేశం


మైనస్ పాయింట్స్


చాలా చోట్ల సాగదీత  
ఊహించే మలుపులు 


ఫైనల్ వర్దిక్ట్ : నవ్విస్తూ మెసేజ్ ఇచ్చిన రైటర్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS