తెలుగు సినిమా స్థాయి ఎంత? స్టామినా ఎంత? ఎంత పెడితే - ఎంత రాబడుతుంది? ఈ లెక్కలన్నీ పటా పంచలు చేసి, తెలుగు సినిమా కీర్తిని, ఖ్యాతినీ ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం..
చందమామ కథని, గ్రాండ్ విజువల్స్‌తో - నభూతో... న భవిష్యత్ అనే రీతిలో చూపించిన చిత్రరాజం..
ప్రభాస్ ని జాతీయ, అంతర్జాతీయన నటుడిగా, కథానాయకుడిగా పరిచయం చేసిన ఓ అపురూప కళా ఖండం..
ఇంకేంటి...??? బాహుబలి కాకుండా.
బాహుబలికి ముందు తెలుగు సినిమా వేరు, బాహుబలి వచ్చాక వేరు. కథల స్థాయి, బడ్జెట్, టెక్నాలజీ ఒకటేంటి... సినిమాకి సంబంధించిన అన్ని విభాగాల్లో, కోణాల్లో కొత్త పుంతలు తొక్కించిన సినిమా బాహుబలి.
పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాల్ని తీర్చిదిద్దగలుతున్నారంటే, హిందీ ప్రేక్షకులు కూడా తెలుగు సినిమా గురించి ఎదురు చూసేలా చేయగలుగుతున్నామంటే అది బాహుబలి చలవే. ఈ సినిమా విడుదలై... ఈరోజుకి ఐదేళ్లు. అంటే ఓ అద్భుతం పుట్టి ఐదేళ్లయ్యిందన్నమాట.
బడ్జెట్ విషయంలో రాజమౌళి తీసుకున్న సంచలన నిర్ణయం తెలుగు చిత్రసీమనే కాదు, దక్షిణాది మొత్తాన్ని ఆలోచలో పడేసింది. అంతకు ముందు తెలుగు సినిమా బడ్జెట్ అంటే 60 నుంచి 70 కోట్లలోపే. అది కూడా చాలా రిస్కుతో కూడిన వ్యవహారం. రాజమౌళి మాత్రం తన సినిమాకి 150 కోట్ల బడ్జెట్ పెట్టేశాడు. పైగా రెండు భాగాల్లో సినిమా తీస్తాన్నాడు. అదీ పెద్ద సంచలనమే. సగం సినిమా కోసం టికెట్ పెట్టి జనం చూస్తారా? అనేది పెద్ద ప్రశ్న. ఓ కమర్షియల్ సినిమాని రెండు భాగాలుగా తీసి, రెండో భాగం కోసం జనం ఎదురు చూసేలా చేయడం రాజమౌళికే సాధ్యం అయ్యింది.
ఈ సినిమా కోసం కిలికీ భాషని సృష్టించాడు రాజమౌళి. ఓ సినిమా కోసం ప్రత్యేకమైన భాషని తయారు చేయడం ఓ సంచలనం. షూటింగ్‌కి వెళ్లేముందు దాదాపు యేడాది పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగాయి. ఈ సమయంలో ప్రభాస్, రానా కత్తి యుద్ధాలు నేర్చుకున్నారు. గుర్రపు సవారీ లో ప్రావీణ్యం తెచ్చుకున్నారు. అనుష్క, తమన్నాలూ అంతే. దాదాపు 15 వేల స్కెచ్చులు రెడీ చేశారు. ఓ తెలుగు సినిమా కోసం ఇంత భారీ ఎత్తున సిద్ధం అవ్వడం ఇదే తొలిసారి.
యుద్ధ సన్నివేశాలు, ఎమోషన్ సన్నివేశాలు, కథానాయకుడి ధీరోదాత్తం - ఇలా ఏ విషయంలోనూ రాజమౌళి తగ్గలేదు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, నాజర్, అనుష్క, సత్యరాజ్... ఈ ఆరు పాత్రల చుట్టూ కథని అందంగా, అద్భుతంగా నడిపి - మ్యాజిక్ చేశాడు. సినిమా అంతా ఒక ఎత్తయితే... క్లైమాక్స్ మరో ఎత్తు. బాహుబలి 2 చూడాలన్న ఆత్రాన్ని అక్కడే పెంచేశాడు రాజమౌళి
బాహుబలి కట్టప్పని ఎందుకు చంపాడు? అనేది జాతీయ స్థాయిలో ట్రెండింగ్ క్వశ్చన్ అయ్యింది.
తొలి పార్ట్ సూపర్ హిట్టు. రికార్డులన్నీ బ్రేక్ చేసేసింది. దాదాపు 650 కోట్లు సాధించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. చిత్రబృందం కృషి ఊరకే పోలేదు. పలు జాతీయ అవార్డులతో పాటు 13 నంది అవార్డుల్నీ సొంతం చేసుకుంది బాహుబలి - ది బిగినింగ్!