కరోనా తరవాత... థియేటర్లు తెరచుకోవడం ప్రారంభించాయి. కొత్త సినిమాలూ వస్తున్నాయి. ఈ సంక్రాంతికి ఏకంగా 5 సినిమాలు రాబోతున్నాయి. అయితే.. నిర్మాతల్లో ఎక్కడో కాస్త అసంతృప్తి. 100 శాతం ఆక్యుపెన్సీ లేకపోవడమే దానికి కారణం. 50 శాతం టికెట్లు అమ్ముకోవడం వల్ల .. పెద్దగా లాభాలు రావు. పైగా.. సంక్రాంతి సీజన్ లో థియేటర్లన్నీ కళకళలాడతాయి. అలాంటి పరిస్థితుల్లోనూ సగం టికెట్లే అమ్ముకోవడం రుచించడం లేదు. 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఇస్తే... పరిశ్రమకు మేలు జరుగుతుందన్నది నిర్మాతల ఆశ.
ఇప్పుడు తమిళ నాడు ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చేసింది. ఈ మేరకు ఓ జీవో కూడా విడుదల చేసింది. తమిళనాట ఇప్పుడు హౌస్ ఫుల్ బోర్డులు చూడొచ్చన్నమాట. అయితే తెలుగులో కూడా ఇలాంటి అనుమతులు వస్తే బాగుణ్ణు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగులో కూడా 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇస్తే.. ఈ సంక్రాంతి గొప్పగా ఉంటుందన్నది నిర్మాతల మాట. తమిళనాట హీరో విజయ్.. అక్కడ 100 శాతం ఆక్యుపెన్సీ కోసం బాగా కష్టపడ్డాడు. తన `మాస్టర్` సినిమా త్వరలో రాబోతోంది కదా..? అందుకే.. ప్రభుత్వానికి పలుమార్లు వినతులు అందించాడు. దాంతో అక్కడ విజయ్ మాట వర్కవుట్ అయ్యింది. తెలుగులోనూ.. హీరోలంతా కలసి అలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. సంక్రాంతి సీజన్ అతి త్వరలోనే మొదలవుతుంది. ఈలోగా.. అనుమతులు వస్తే... బాక్సాఫీసు పంట పండినట్టే