లాక్ డౌన్ సమయంలో.. సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారా? అని ఎదురు చూశారు. తీరా తెరిచాక... 50 శాతం ఆక్యుపెన్సీకి సర్దుకోలేక... 100 % సిట్టింగ్ కి ఎప్పుడు అనుమతులు ఇస్తారా? అని ఆరా తీశారు. ఇప్పుడు ఆ శుభ తరుణం వచ్చేసింది. థియేటర్లలో 100 శాతం సిట్టింగ్ కి కేంద్రం అనుమతులు ఇచ్చేసింది. ఫిబ్రవరి 1 నుంచే థియేటర్లలో సీట్లన్నీ నింపుకోవొచ్చు. హౌస్ ఫుల్ బోర్డులు పెట్టుకోవొచ్చు. చిత్రసీమ ఈ తరుణం కోసమే ఇన్నాళ్లూ ఆశగా ఎదురు చూసింది. సంక్రాంతికే ఈ ప్రకటన వస్తుందని భావించారంతా. కానీ... కేంద్రం కనికరించలేదు.
సంక్రాంతికే కేంద్రం ఈ ప్రకటన జారీ చేసి ఉంటే.. క్రాక్ లాంటి సినిమాలు మరిన్ని మంచి వసూళ్లు దక్కించుకునేవి. అయినా.. ఇప్పటికైనా మించి పోయిందేం లేదు. ఫిబ్రవరి నుంచి... సినిమాల జాతర మొదలవుతోంది. ప్రతీ వారం... రెండు కొత్త సినిమాలొస్తున్నాయి. వేసవి అయ్యేంత వరకూ ఇదే... జోరు. మేలో అయితే... చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణల సినిమాలు మూడూ.. వరుస కడుతున్నాయి. ఒకే నెలలో ముగ్గురు అగ్ర హీరోల సినిమాలు రావడం నిజంగా.. ఓ అరుదైన సంగతే. పైగా చిరు, వెంకీల సినిమాలకు ఒక్క రోజే గ్యాప్ వుంది.
వకీల్ సాబ్, అరణ్య, కేజీఎఫ్ లాంటి సినిమాలు వేసవి బరిలో ఉన్నాయి. ఈ సినిమాలన్నింటికీ... 100 శాతం ఆక్యుపెన్సీ ఓ అదనపు వరమే. 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు పెద్ద నిర్మాతలు జంకారు. థియేటర్లు హౌస్ ఫుల్స్ అవ్వడానికి ఆస్కారం లేకపోతే... మా పెట్టుబడి ఎలా రాబట్టుకునేది? అంటూ ఆందోళనకు గురయ్యారు. థియేటర్లు తెరచుకున్నా. కొన్ని పెద్ద సినిమాలు విడుదల కాకపోవడానికి కారణం అదే. ఇప్పుడు.... ఆ భయమూ తొలగిపోయింది.