'2.0'
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా '2.0' ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.. మరికొద్ది గంటల్లోనే సినిమా సంగతేంటో తేలిపోతుంది. భారీ స్థాయిలో సినిమాని రిలీజ్ చేస్తున్న దరిమిలా, ఓపెనింగ్ డే రికార్డ్స్ తమవేనని రజనీకాంత్ అభిమానులు ఫిక్సయిపోయారు. ట్రేడ్ పండితులూ రజనీకాంత్ అభిమానులతో గొంతు కలుపుతున్నారు. ఓ అంచనా ప్రకారం 10,500 థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా '2.0' విడుదలవుతోందట. విదేశాల్లో ఇప్పటికే సినిమా ప్రచారం జోరందుకుంది.
లండన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, అరబ్ దేశాలు, మలేసియా, సింగపూర్.. ఇలా వివిధ దేశాల్లో రజనీకాంత్ అభిమానులు '2.0' సినిమా ప్రమోషన్‌ని తమ సొంత బాధ్యతగా తీసుకున్నారు. ప్రత్యేక వాహనాలు రూపొందించి, హంగామా సృష్టించేస్తున్నారు. ఇండియాలో చెన్నయ్, హైద్రాబాద్, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇప్పటికే '2.0' హంగామా కన్పిస్తోంది. ఎక్కడికక్కడ తొలి రోజు వసూళ్ళ రికార్డులు సృష్టించాలన్న కసితో '2.0' టీమ్ వుంది. తెలుగు రాష్ట్రాల్లో '2.0' మేనియా పీక్స్‌కి చేరిపోయింది.
రజనీకాంత్ సినిమాలకి, స్ట్రెయిట్ తెలుగు సినిమాలకున్న క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో కన్పిస్తుంటుందని అందరికీ తెలుసు కదా. మొత్తమ్మీద, '2.0' మేనియా తారాస్థాయికి చేరింది. 'బాహుబలి' వసూళ్ళను దాటేస్తుందని రజనీకాంత్ అభిమానులు అంటోంటే, టచ్ చేయడం అంత తేలిక కాదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రజనీకాంత్ ఇటీవల నటించిన సినిమాల రిజల్ట్ తీసుకుంటే, ఈ సినిమా బయ్యర్స్‌కి షాక్ ఇవ్వకుండా వుంటే చాలన్నది చాలామంది అభిప్రాయం.