'2.0'
ఓ సినిమా విడుదలవుతోందంటే, ఎక్కడ ఏ థియేటర్లలో ప్రదర్శితమవుతున్నా.. అక్కడికి పరుగులు పెడుతుంటారు ప్రేక్షకులు. ఇది పెద్ద సినిమాల విషయంలో తరచూ చూస్తుంటాం. చాలా కొన్ని సినిమాల విషయంలోనే, 'చూస్తే, ఫలానా థియేటర్‌లోనే సినిమా చూడాలి.. అక్కడ ఆ సినిమా చూస్తే ఆ కిక్కే వేరప్పా..' అనుకుంటుంటాం. అలాంటి ప్రత్యేకమైన సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఆ కోవలోకే '2.0' సినిమా చేరుతుంది.
ఇదొక సాంకేతిక అద్భుతం కాబోతోందని అందరికీ తెలుసు. అందుకే, అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవుతూనే, అత్యద్భుతమైన థియేటర్ల ఎంపిక కోసం వెతుకులాట షురూ అయ్యింది. కొన్ని థియేటర్లు '2.0' సినిమా కోసమే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నాయి. చెన్నయ్‌లోని సత్యం థియేటర్, జికె సినిమాస్‌తోపాటు, గుంటూరులోని వి ప్లానెటో సినిమాస్.. ఎస్‌ఆర్‌ఎల్ 4డి సౌండ్ సిస్టమ్‌తో ప్రేక్షులకు సరికొత్త అనుభూతివ్వనున్నాయి.
ఇంకా మరికొన్ని థియేటర్లు ఈ సాంకేతికతో ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయబోతున్నాయి. మన దేశంలో అతి కొద్ది థియేటర్లు మాత్రమే ఈ సాంకేతికను కలిగి వుండగా, విదేశాల్లో చాలా థియేటర్లు ఆ సాంకేతికను అందిస్తున్నాయి. '2.0' సినిమా చూసేందుకోసం హైద్రాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి ఎక్కువమంది చెన్నయ్‌కి పరుగులు తీస్తున్నారట. ఇందుకోసం విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు ముందుగానే. ఎందుకంటే, అక్కడే పూర్తిస్థాయిలో రజనీకాంత్ మేనియా చూసే అవకాశముంటుంది మరి.