సెకెన్ల వ్యవధిలోనే సినిమా చూపించేశాడు ప్రముఖ దర్శకుడు శంకర్. సినిమా సైంటిస్ట్‌గా శంకర్‌ని అభివర్ణిస్తే అది అతిశయోక్తి కాదేమో. ఇండియన్ సినిమా రేంజ్‌ని పెంచేసిన ఈ ప్రముఖ దర్శకుడు తన కొత్త సినిమా '2.0'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. దానికోసం తాజాగా టీజర్‌ని విడుదల చేశారు ఈ రోజు.
ఎలా వుంటుంది శంకర్ దర్శకత్వంలో రూపొందే సినిమా? అన్న ప్రశ్నకి సమాధానం చెప్పడం కాదు, పది మందికి ఈ టీజర్‌ని చూపించాలి. పది మందికి కాదు, చూసినోళ్ళు వంద మంది, వెయ్యి మందికి చూపించెయ్యాలి. ఇండియన్ సినిమా స్క్రీన్‌పై ఇలాంటి అద్భుతాన్ని మనం చూడగలమా? అన్పిస్తుంది. హాలీవుడ్‌కి మాత్రమే పరిమితమైన సాంకేతిక పరిజ్ఞానం మన సొంతమైందన్పించడం ఖాయం. ఆ స్థాయిలో వుంది 'రోబో' సీక్వెల్ '2.0' టీజర్.
సెకెన్ల నిడివిగల టీజర్ ఇలా వుంటే, ట్రైలర్ ఇంకెలా వుంటుందో ఊహించుకోవచ్చు. సినిమా గురించి అంచనాలు ఎన్నయినా పెట్టుకోవచ్చు.. ఎంత పెద్ద అంచనాలు పెట్టుకున్నా, వాటిని మించిపోవడం ఖాయం. ఓ వింత ఆకారం ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంటే, సైంటిస్ట్ 'చిట్టి రోబో'ని రంగంలోకి దించుతాడు ఆ ప్రజల్ని రక్షించడం కోసం. అదే సినిమా కాన్సెప్ట్.
సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ ఈ సినిమాలో ప్రధాన తారాగణం. ఈ విజువల్ వండర్‌ని తెరపై చూడాలంటే ఇంకొంత సమయం పడ్తుంది. ఈలోగా టీజర్‌ని రికార్డు స్థాయిలో ప్రత్యేకంగా థియేటర్లలో ప్రదర్శించేస్తున్నారు. ఇది ఈ సినిమాకి సంబంధించి అరుదైన రికార్డ్.