కరోనా ఎవరినీ వదల్లేదు. అన్ని పరిశ్రమలపై ప్రభావం చూపించింది. సినిమా పరిశ్రమ అయితే మరీ చితికిపోయింది. ప్రతి శుక్రవారం కొత్త సినిమాతో కళకళలాడే థియేటర్ బోసిపోయింది. మనిషికి మనిషే ఎదురుపడి పలకరించే భయంకర పరిస్థితి నెలకొంది. థియేటర్లు మూతపడ్డాయి. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకుకొని పరిస్థితి. అయితే ఓటీటీ కొంత ఉపసమనం కలగించింది. కొన్ని సినిమాలు వీటి ద్వార విడుదలకు నోచుకున్నాయి. అంతకుముందు సంక్రాంతి వరకూ సినిమా పరిశ్రమ బాగానే నడిచింది. మొత్తంగా కలుపుకొని ఈ ఏడాది తెలుగు సినిమా రివ్యూలోకి వెళితే...
ఆరంభం అదిరింది :
2020 టాలీవుడ్ శుభారంభం చేసింది. సంక్రాంతి సినిమాలతో కళకళలాడింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ .. ఇద్దరూ అదరగొట్టారు. మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' తో సత్తా చాటితే, బన్నీ 'అల వైకుంటపురములో' అలరించాడు. ఇద్దరూ బాక్సాఫీసు విజేతలే. అయితే 'అల వైకుంటపురములో' గురించి కొంచెం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అల్లు అర్జున్ కెరీర్ లోనే హయ్యెస్ట్ వసుళ్ళూ సాధించిన సినిమాగా నిలించింది. సరిలేరు నీకెవ్వరుతో పోల్చి చేస్తే రిపీట్ ఆడియన్స్ తెచ్చుకున్న సినిమా. త్రివిక్రమ్ క్లాస్ మాస్ టచ్ ప్రేక్షకుల చేత వారెవ్వా అనిపించింది. ఆడియో కూడా చార్ట్ బస్టర్. సంక్రాంతికి ఫ్యామిలీ సినిమా అయ్యింది. అయితే ఫ్యామిలీ సినిమా అనే ఇమేజ్ తో వచ్చిన కల్యాణ్ రామ్ `ఎంత మంచివాడవురా'' ఆకట్టు కోలేకపోయింది. 'శతమానం భవతి' మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశించిన సతీస్ వేగ్నేష్ కి నిరాశ తప్పలేదు.
సంక్రాంతి తర్వాత మెరుపుల్లేవ్: ఆరంభం అదరగొట్టిన టాలీవుడ్ ద్వితీయ విఘ్నం దాటలేకపోయింది. రవితేజ `డిస్కోరాజా`, నాగశౌర్య `అశ్వద్ధామ`, `96`కి రీమేక్ గా వచ్చిన `జాను` పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. విజయ్ దేవరకొండ `వరల్డ్ ఫేమస్ లవర్` పై అంచనాలు పెరిగాయి. దానితోడు షర్టు విప్పేసి ప్రమోషన్ కనిపించాడు విజయ్. దాంతో మరో అర్జున్ రెడ్డి అయిపోతుందా? అనుకున్నారంత. కానీ మెప్పించలేకపోయాడు. మూడు లవ్ స్టోరీలు కలిపిచూపించిన ఈ కధ ఏ కంచికి చేరకుండా మిగిలిపోయింది.
భీష్మా తర్వాత అంతా బ్లాక్:
వెంకీ కుడుమల మళ్ళీ ఓ హిట్ ఇచ్చాడు. ఛలో తో లైటర్ వెయిన్ వినోదం పై పట్టు సాధించిన వెంకీ , నితిన్ తో భీష్మా చూపించాడు. నితిన్, రష్మిక జంటగా వచ్చిన `భీష్మ` ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. నితిన్ కెరీర్‌లో ఇది పెద్ద హిట్టు. యూత్ తో పాటుగా, కుటుంబ ప్రేక్షకులకి కూడా నచ్చాడు భీష్మ. ఇక తర్వాత వచ్చిన విశ్వక్ సేన్ `హిట్ ' కి మంచి మార్కులే పడ్డాయి. టాలీవుడ్ క్యాలెండర్ మార్చిలోకి వెళ్ళింది. మార్చి 6న విడుదలైన `పలాస` విమర్శకుల్ని మెప్పించింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగాయి . భయంతో జనాలు థియేటర్ లోకి రావడం కూడా తగ్గింది. ఇక 17 నుంచి థియేటర్లు మూతబడ్డాయి.
ఇక అంతా ఓటీటీ సౌజన్యంలో .. లాక్ డౌన్ ఎప్పుడు తీస్తారో తెలీదు. వచ్చినా జనాలు వస్తారో లేదో అంచనా వేసుకోలేని పరిస్థితి. ఈ నేపధ్యంలో ఓటీటీ సంస్థలు పెద్ద దిక్కుగా మారాయి. కొన్ని సినిమాలు వరస కట్టాయి. ఏప్రిల్ 29న జీ 5లో `అమృతారామమ్` విడుదలైంది. నేరుగా ఓటీటీలోకి వచ్చిన తొలి తెలుగు సినిమా ఇది. అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత కీర్తి సురేష్ నటించిన `పెంగ్విన్` అమేజాన్ ప్రైమ్‌లో వచ్చింది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన మెప్పించలేకపోయింది. సావిత్రిగా కీర్తిని చూసిన ప్రేక్షకులకు పెంగ్విన్ లాంటి కధను ఎంచుకుకొని నిరాశ పరిచింది. తర్వాత కృష్ణ అండ్ హిజ్ లీల, 47 డేస్, భానుమతి రామకృష్ణ, ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య, జోహార్.. ఇలా చిన్న సినిమాలన్నీ ఓటీటీకి వరుస కట్టాయి. ఇందులోభానుమతి రామకృష్ణ, ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్యకి మంచి మార్కులు పడ్డాయి.
మీడియం సినిమాలకు దెబ్బ:
ఓటీటీతో ఓ సమస్య వుంది. కొంచెం మీడియం రేంజ్ సినిమాలు, థియేటర్ టార్గెట్ గా తీసిన సినిమాలు కానీ ఇక్కడ వర్క్ అవుట్ కాకపొతే నష్టాలు తప్పవు. అందుకే ఓటీటీ అంటే వెనకడుగు వేస్తారు. ఇలా దెబ్బ కొట్టిన సినిమాలు రెండు. వి, నిశ్శబ్దం. `వి` హక్కుల్ని అమేజాన్ ప్రైమ్ దక్కించుకుంది. నాని, సుధీర్ బాబు కథానాయకులుగా నటించడం, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకుడు అవ్వడం, దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి రావడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే సినిమా దెబ్బ కొట్టేసింది. ఇదే దారిలో వచ్చిన `నిశ్శబ్దం` సైతం.. సైలెంట్ అయిపొయింది. ఈ రెండు కూడా థియేటర్ టార్గెట్ గా తీసిన సినిమాలు. ఒటీటీలో చూసిన ప్రేక్షకులు.. థియేటర్ లో రాకపోవడమే మంచిందనే కామెంట్లు పాస్ చేశారు. తర్వాత వచ్చిన ...కీర్తి సురేష్ `మిస్ ఇండియా`, రాజ్ తరుణ్ ,, ఒరేయ్ బిజ్జిగా కూడా ఆకట్టుకోలేకపోయాయి.
చిన్న సినిమా మెరిసింది:
ఓటీటీలో చిన్న సినిమాకి ఓ సౌలభ్యం వుంటుంది. ఎలాంటి అంచనాలు వుండవు. కాన్సప్ట్ బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలా వచ్చి అలరించిన సినిమాలు `కలర్ ఫొటో`, `మిడిల్ క్లాస్ మెలోడీస్`. ఇందులో కలర్ ఫోటో కి మంచి మార్కులు పడతాయి. చిన్న సినిమానే అయినా రైటింగ్ బ్రిలియన్స్ చూపించిన సినిమా కలర్ ఫోటో. కొత్త పాయింట్ ఏమీ కాదు. పేద, ధనిక వర్గ ప్రేమ కధలు బోలెడు. కానీ ఆ పాయింట్ ని వర్ణంలోకి కాయిన్ చేసి కుల, వర్గ, వర్ణ వ్యస్థలని ఓ ప్రేమలో చూపించడం బ్రిలియంట్.
పెద్ద హీరోలు ముందుకు రావాలి:
సుధీర్గ విరామం తర్వాత థియేటర్లు తెరచుకున్నాయి. కానీ పరిస్థితి సర్దుకోవడానికి ఇంకా కొంచెం సమయం పట్టేలా ఉంది. ఒక్క తెలుగు సినిమా కూడ ఇంకా నేరుగా థియేటర్లోకి రాలేదు. ఆల్రెడీ ఒటీటీలో వచ్చిన సినిమాతో మళ్ళీ థియేటర్లోకి జనాలని అలవాటు చేసే ప్రయత్నం జరిగుతుంది. ఇలాంటి నేపధ్యంలో బడా హీరోలపైనే ఆశల్నీ వున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్... వీళ్ళంతా క్రౌడ్ ఫుల్లర్స్. అభిమానులు ప్రేమగా కటౌట్స్ కట్టి థియేటర్ కళకళలాడించే స్టామినా వున్న హీరోలు. వీళ్ళ సినిమాలు కనుక 2021 లో థియేటర్లలో వస్తే ... మళ్ళీ పునర్ వైభవం రావడం పెద్ద సమస్య కాదు. ఆ ఆశతోనే 2021 కాలెండర్ లోకి ఎంటర్ అవుతుంది తెలుగు చిత్ర సీమ.