సెకండ్ వేవ్ తరవాత.. ఎట్టకేలకు థియేటర్లు తెరచుకోబోతున్నాయి. ఈనెల 30న బాక్సాఫీసు దగ్గరకు రెండు సినిమాలు రాబోతున్నాయి. తిమ్మరుసు, ఇష్క్ రెండూ విడుదలకు సిద్ధమయ్యాయి. సుదీర్ఘ విరామం తరవాత ఓ సినిమా థియేటర్లో విడుదల కాబోతుండడంతో సాధారణంగానే ఆసక్తి నెలకొంది. ఇష్క్ ఓ రొమాంటిక్ థ్రిల్లర్ అయితే.. తిమ్మరుసు ఓ కోర్టు రూమ్ డ్రామా. రెండూ చిన్న సినిమాలే అయినప్పటికీ.. ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
అయితే... ఏపీలో మాత్రం ఈ రెండు సినిమాలకూ చుక్కలు ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీలో కేవలం 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఉంది. పైగా బీ,సీ సెంటర్లలో సవరించిన టికెట్ రేట్ల ప్రకారమే సినిమాలు నడుపుకోవాలి. అక్కడ 10, 20 రూపాయిలకు టికెట్ అమ్ముకోవడం థియేటర్ యజమానులకు, బయ్యర్లకు ఇష్టం లేదు. తక్కువ రేట్లకు టికెట్ అమ్ముకుంటే, థియేటర్ ఫుల్ అయినా లాభం లేదు. అలాంటప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీ అంటే... కోరి నష్టాల్ని భరించడమే. అందుకే ఏపీలో చాలామట్టుకు థియేటర్లని మూసే ఉంచబోతున్నారని సమాచారం. కేవలం మల్టీప్లెక్స్ లో మాత్రమే సినిమాల్ని ఆడిస్తార్ట. అలాగైతే.. ఇష్క్, తిమ్మరుసు .. ఈ రెండు సినిమాలకూ నష్టమే. ఆగస్టు తొలి వారంలోనూ సినిమాలు జోరుగా విడుదల కాబోతున్నాయి. అవి కూడా ఇప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీలో ఇది వరకటి రేట్లు అమలులోకి వచ్చేంత వరకూ పెద్ద సినిమాలు విడుదల అయ్యే ఛాన్సే లేదు.