నాని స్పీచులు చూడండి. చాలా సరదాగా ఉంటాయి. ఫన్నీగా మాట్లాడతాడు. వివాదాల జోలికి అస్సలు వెళ్లడు. అలాంటి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పెద్ద పెద్ద హీరోలంతా మాట్లాడడానికి భయపడుతున్న టాపిక్ ని నాని లేవనెత్తాడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వాలపై ప్రశ్నలు సంధించాడు. ఇంతకీ మేటరేంటంటే...?
సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన `తిమ్మరుసు` ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి నాని అతిథిగా వెళ్లాడు. అక్కడ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇండ్రస్ట్రీ గురించి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ``కరోనా లాంటి సమయాల్లో అన్నింటికంటే ముందు థియేటర్లని మూసేస్తారు. అన్నిటికంటే చివర్లో థియేటర్లు తెరుస్తారు. పబ్బులూ, రెస్టారెంట్లలో నిబంధనలేం ఉండవు. సినిమా థియేటర్లకు మాత్రం ఉంటాయి. నిజానికి అన్నింటికంటే థియేటర్లే సేఫ్. అక్కడ ఎవరూ పెద్దగా మాట్లాడుకోరు. నిశ్శబ్దంగా సినిమా చూస్తారు. అన్నిటిరేట్లూ రోజురోజుకీ పెరుగుతున్నాయి. సినిమా టికెట్ రేట్లు మాత్రం తగ్గుతున్నాయి. సినిమా వాళ్ల సమస్యని చిన్న సమస్యగా చూస్తారంతా. కానీ ఇది పెద్ద సమస్యే. కాస్త పట్టించుకోండి. ఇది నానిగా మాట్టాడడం లేదు. ఓ సినీ అభిమానిగా మాట్లాడుతున్నా`` అన్నారు నాని.
నాని ఇలాంటి కామెంట్లు చేయడం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. ఇండ్రస్ట్రీ పెద్దలు మాట్లాడాల్సిన మేటర్ ఇది. ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశమిది. ఈ విషయంలో ముందుగా నాని స్పందించాడు. మిగిలిన పెద్ద హీరోలూ స్పందించి, ఈ సమస్యని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తే.. ఫలితాలు ఉంటాయి.