'30 రోజుల్లో..' నిర్మాతలకు ఓటీటీల షాక్?

మరిన్ని వార్తలు

గత ఐదు నెలలుగా సినిమా థియేటర్లు మూతపడి ఉండడంతో థియేట్రికల్ రిలీజులు ఆగిపోయాయి. అయితే కొత్త టెక్నాలజీ పుణ్యమా అని ఓటీటీ వేదికల ద్వారా సినిమాలను విడుదల చేసుకునే వెసులుబాటు ఉండడంతో కొందరు చిన్న సినిమాల నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ వేదికల ద్వారా రిలీజ్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం థియేటర్లు తిరిగి ఓపెన్ చేసే వరకు వేచి చూడాలని నిర్ణయించుకోవడంతో ఓటీటీ వేదికల వారు ఇచ్చే క్రేజీ ఆఫర్లను అప్పట్లో పట్టించుకోలేదు. అయితే ఈ మధ్య ఓ స్టార్ హీరో నాని నటించిన 'V' సినిమాను దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ వారికి అమ్మడంతో చాలామంది నిర్మాతలలో చలనం వచ్చిందని సమాచారం.

 

థియేటర్లు ఎప్పుడు తిరిగి తెరుస్తారో తెలియదు. ఒకవేళ తెరిచినా బాక్సాఫీస్ కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతాయనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు. దీంతో ఇప్పుడు చాలామంది ఆలోచనలో పడ్డారట. 'V' సినిమా లాగానే తమ సినిమాలను తర్వాత థియేటర్లలో కూడా రిలీజ్ చేసుకునే సౌలభ్యం ఉంది కాబట్టి ఇదే మేలని భావిస్తున్నారట. రీసెంట్ గా ఇదే ఆలోచనతో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా నిర్మాతలు ఓటీటీ వేదికలను సంప్రదించారని రూమర్లు వినిపిస్తున్నాయి. ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన 'నీలి నీలి ఆకాశం' పాట భారీగా వ్యూస్ సాధించి సినిమాకు మంచి ప్రచారం తీసుకువచ్చింది. దీంతో అప్పట్లోనే అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమాకు రూ.6 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని సమాచారం.

 

అయితే ఇప్పుడు సినిమా నిర్మాతలు ఓటీటీ వేదికల వారిని సంప్రదిస్తూ ఉంటే సినిమాకు రూ.3 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఇవ్వమని అంటున్నారట. పలు సినిమాల షూటింగులు నెమ్మదిగా ప్రారంభం కావడం, త్వరలో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండడంతో ఓటీటీ వేదికలు వారు గతంలో మాదిరిగా ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా లేరట. స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువ ఆఫర్ చేస్తారేమో కానీ చిన్న హీరోల సినిమాలకు ఓటీటీలు భారీగా బేరమాడుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా నిర్మాతలు విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS