ప్రభాస్ చేతికి మరో భారీ ప్రాజెక్టు చేరిందా? మరో బాలీవుడ్ సినిమాలో నటించడానికి రంగం సిద్ధం అవుతోందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇటీవల `ఆది పురుష్`కి సంబంధించిన ప్రకటన వచ్చింది. రామాయణ నేపథ్యంలో సాగే కథ ఇది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాలో ప్రభాస్ కనిపించబోతున్నాడన్నది టాక్.
హృతిక్ రోషన్, ప్రభాస్ కలిసి ఓ సినిమా చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూ వుంది. `వార్ 2`లో వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవుతుందనుకున్నారు. కానీ కుదర్లేదు. అయితే `ధూమ్ 4`లో మాత్రం ఈ కాంబినేషన్ ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్‌లో ప్రభాస్ ఓ సినిమా చేయాలి. అది ధూమ్ 4 అని టాక్. యశ్ రాజ్ త్వరలోనే 50వ వార్షికోత్సవం జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోందని తెలుస్తోంది. `ధూమ్` సిరీస్ ఎప్పుడూ మల్టీస్టారర్ ప్రాజెక్టుగానే వస్తోంది. ఈసారీ అంతే. అయితే ఈసారి హృతిక్ తో తలపడేది ప్రభాస్ అయితే.. ఆ మజానే వేరుగా ఉంటుంది.