పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' అనే రొమాంటిక్ కామెడీ మూవీతో హీరోగా మారుతున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర 'ఆర్య 2', 'నేనొక్కడినే' సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనే ఈ సినిమాకు రచన కూడా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ లను శనివారం 'బాహుబలి' స్టార్ రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. రానాకు ఈ పోస్టర్ల కాన్సెప్టు, సంగీతం నచ్చి '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' బృందానికి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఫస్ట్ లుక్ పోస్టరులో పల్లెటూరి వేషంలో ఉన్న ప్రదీప్, సినిమాలో తన ప్రేయసిగా నటిస్తోన్న అమృత అయ్యర్ తో పాటు కులాసాగా కనిపిస్తున్నాడు. ఇద్దరి ముఖాల్లోనూ ఉల్లాసం తాండవిస్తోంది. సూర్యోదయం, జలపాతాలు, పక్షులు, చెట్లతో బ్యాగ్రౌండ్ ఒక అందమైన పెయింటింగ్ ను తలపిస్తోంది. టైటిల్ డిజైన్ కూడా ఆసక్తికరంగా ఉంది. బాణం విసురుతున్న మన్మథుడు, గులాబీ, లవ్ లెటర్, తాళం వేసిన హృదయం వంటి వాటితో ఆ టైటిల్ ను రూపకల్పన చేశారు.