నటీనటులు : సత్యదేవ్, పూజా జవేరి, రోషిని తదితరులు
దర్శకత్వం : ప్రదీప్ మద్దాలి
నిర్మాతలు : శశి భూషణ్, రఘు కుంచె, శ్రీశర్,విజయ్ శంకర్
సంగీతం : రఘు కుంచె
సినిమాటోగ్రఫర్ : జి.కే
ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్
రేటింగ్: 2.5/5
వెండి తెర కాస్త - ఓటీటీకి షిఫ్ట్ అవుతున్న కాలం ఇది. థియేటర్ల గురించి మర్చిపోయి.. ఇంట్లోనే సినిమాలు చూడ్డానికి ఓటీటీలు వేదిక కల్పిస్తున్నాయి. పెద్ద సినిమాలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి గానీ, చిన్న, మధ్యస్థాయి బడ్జెట్ చిత్రాలు ఓటీటీ వైపు చూస్తున్నాయి. దాంతో.. కొన్ని కొత్త సినిమాలు నేరుగా ఇంటి వద్దనే చూసే అవకాశం దక్కుతోంది. అందులో భాగంగా జీ5లో విడుదలైన మరో కొత్త సినిమా `47 డేస్`. సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మరి ఈ `47 డేస్` ఎలా వుంది? ఏమా కథ?
* కథ
సత్య (సత్యదేవ్) విశాఖకి ఏసీపీ. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య పద్దు (రోషిణి ప్రకాష్) సడన్ గా ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె ఆత్మహత్య వెనుక ఏదో మిస్టరీ ఉందన్నది సత్య అనుమానం. ఎంత ప్రయత్నించినా దాన్ని కనిపెట్టలేకపోతాడు. దాంతో ఫస్ట్రేషన్‌కి గురైన సత్య - సస్పెన్షన్ వేటుకి బలవుతాడు. భార్యని కోల్పోయి, ఉద్యోగానికి దూరమైన వేళ... తన భార్య ఆత్మహత్యకీ జూలియట్ (పూజా జావేరీ)కీ ఏదో సంబంధం ఉందన్న సంగతి తెలుస్తుంది. ఆమెను పట్టుకోబోతే సడన్‌గా డ్రగ్స్ కేసులో చిక్కుకుంటుంది జూలియట్. ఇంతకీ జూలియట్ ఎవరు? ఆమెకీ పద్దు ఆత్మహత్యకీ నిజంగానే సంబంధం ఉందా? ఈ మిస్టరీని సత్య ఎలా ఛేదించాడు? అనేదే కథ.
* విశ్లేషణ
కొత్త దర్శకుడు ప్రదీప్ ఓ చక్కటి కథ రాసుకున్నాడు. థ్రిల్లర్‌కి అనువైన కథ ఇది. దాన్ని మొదలెట్టిన విధానం కూడా బాగుంది. లాక్స్ కూడా సరిగానే వేసుకున్నాడు. చివర్లో దాన్ని విప్పిన తీరూ బాగుంది. కానీ ఇబ్బంది ఏమిటంటే.. ఈమధ్య నడిచే కథ, అందులోని పాత్రలు, వాటి మధ్య గందరగోళాలు. థ్రిల్లర్ సినిమాల్లో కథలకంటే స్క్రీన్ ప్లే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతీ సన్నివేశం ఉత్కంఠత రేకెత్తించేలా ఉండాలి. సాదా సీదా నడక పనిచేయదు. 47 ని ఇబ్బంది పెట్టేది ఆ స్క్రీన్ ప్లేనే. కథ చెప్పడంలో దర్శకుడు వేగం, జోరు చూపించలేకపోయాడు.
విజయవంతమైన ఏ థ్రిల్లర్ అయినా తీసుకోండి. ఒకే థ్రెడ్ మీద నడుస్తాయి. థ్రెడ్స్ ఎక్కువైతే, అసలు కథ మరుగన పడుతుంది. ఇక్కడా అదే జరిగింది. ఈ కథకి ఎమోషనల్ లింకు పెట్టి, థ్రిల్ ని మిస్ చేశాడు. ఈ కథ మొదలైంది... పద్దు ఆత్మహత్యతో. కానీ... ఓ దశలో అసలు కథ పక్కకు వెళ్లిపోతుంది. మరో ఉప కథ మొదలవుతుంది. క్లైమాక్స్ వరకూ దర్శకుడు అసలు కథలోకి రాలేకపోయాడు. జూలియట్ పాత్రని డిజైన్ చేసుకున్న విధానం బాగుంది. ద్వితీయార్థాన్ని నడపడానికి ఆ కథ ఉపయోగపడింది. కాకపోతే పూర్తి స్థాయిలో కాదు. ప్రధాన పాత్రలన్నీ ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది. చాలా చోట్ల సహజత్వం కనిపించదు. సినిమాటిక్ లిబర్టీ, నాటకీయత ఎక్కువ ఉండడంతో - థ్రిల్ మిస్ అయ్యింది. నిడివి పరంగానూ జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అనవసరమైన సన్నివేశాలకు కత్తెర వేస్తే కథనం మరింత గ్రిప్పింగ్ గా మారేది.
*నటీనటులు
సత్యదేవ్‌లోని నటుడు రోజురోజుఇకీ సినిమా సినిమాకీ పరిణితి చెందుతున్నాడు. తన నటన మరోసారి ఆకట్టుకుంటుంది. డైలాగ్ డెలివరీ.. పాత్రలో ఒదిగిపోయిన విధానం, ఎమోషన్ పండిచిన పద్ధతీ.. ఇవన్నీ పర్‌ఫెక్ట్‌గా సూటయ్యాయి. రోషిణి, పూజా జావేరీ ఇద్దరికీ మంచి మార్కులు పడతాయి. విలన్ పాత్రధారి కూడా నచ్చుతాడు. నటీనటుల పరంగా ఎలాంటి లోపాలూ లేవు.
*సాంకేతిక విభాగం
నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి. బడ్జెట్ పరిమితులున్నా స్క్రీన్ పై పెద్దగా కనిపించవు. విశాఖ అందాల్ని కెమెరా బాగా ఒడిసి పట్టుకుంది. సంగీత పరంగా చూస్తే, రఘు కుంచె అందించిన బీజియమ్ హంట్ చేస్తుంది. దర్శకుడికి ఇదే తొలి చిత్రం. కథ బాగానే రాసుకున్నాడు. కానీ థ్రిల్లర్ చిత్రాలకు సరిపడినంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లో లేదు.
* ప్లస్ పాయింట్స్
సత్యదేవ్
బీజియమ్స్
కథలో లాక్
* మైనస్ పాయింట్స్
స్పీడ్ లేని కథనం
అనవసరమైన సన్నివేశాలు
* ఫైనల్ వర్డిక్ట్ : థ‌్రిల్ తగ్గింది