భారతీయ సినిమాలకు ఆస్కార్ రావడం చాలా అరుదైన విషయం. ఆస్కార్ నామినేషన్ పొందితే సరిపోదు. దానికి తగిన ప్రచారం చేసుకోవాలి. అప్పట్లో లగాన్ చిత్రానికి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేషన్ దక్కింది. కానీ అవార్డు రాలేదు. ఆస్కార్ అవార్డు రావాలంటే భారీగా ప్రమోషన్లు చేయాలి, కోట్లు ఖర్చు పెట్టాలి, అంత స్థోమత లేకే... మేం పోటీ పడలేకపోయాం అని అప్పట్లో అమీర్ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ బరిలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతోంది. నెల రోజుల ముందే ఆస్కార్ ప్రమోషన్లలో ఆర్.ఆర్.ఆర్ టీమ్ బిజీ బిజీగా పాల్గొంటోంది. ఇందుకోసం ఏకంగా రూ.80 కోట్లు ఖర్చు పెట్టినట్టు టాక్. ఈ సొమ్మంతా... రాజమౌళి తనే సొంతంగా భరించాడట. ఇటీవల జపాన్, చైనాలలో ఆర్.ఆర్.ఆర్ విడుదలైంది. అక్కడ భారీ వసూళ్లు వచ్చాయి. ఆ లాభాలనే ఆస్కార్ కోసం పెట్టుబడిగా పెట్టారని తెలుస్తోంది. రూ.80 కోట్లు పెట్టి ఆస్కార్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అని అడగొచ్చు. ఆస్కార్ అనేది ఓ ప్రైడ్. ఆస్కార్ తో.. తెలుగు సినిమా బ్రాండ్ ప్రపంచ వ్యాప్తం అవుతుంది. అంతే కాదు... రాబోయే రాజమౌళి సినిమాల మార్కెట్ కీ అది దోహదం చేస్తుంది. అందుకే రాజమౌళి ఇంత రిస్క్ చేశాడన్నది ట్రేడ్ వర్గాల మాట.