భీష్మ తర్వాత నితిన్ వరుసగా అపజయాలు చూశాడు. మాచర్ల నియోజకవర్గం ఇంకా నిరాశ పరిచింది. ఇపుడు వక్కంతం వంశీ తో ఓ సినిమా చేస్తున్నాడు. రచయితగా ఎన్నో సినిమాలకు పని చేసిన వక్కంతం వంశీ.. 'నా పేరు సూర్య' సినిమాతో దర్శకుడిగా మారారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. బన్నీ కెరీర్ లో ఇదొక డిజాస్టర్. దీంతో వక్కంతం వంశీ దర్శకుడిగా మరో అవకాశం రాలేదు. ఈ దశలో నితిన్ తో సినిమా సెట్ అయ్యింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నితిన్. వకీల్ సాబ్ తో ఫామ్ లోకి వచ్చిన వేణు శ్రీరామ్ చెప్పిన కథకి నితిన్ పచ్చజెండా ఊపాడని తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమా నిర్మించనున్నారు. ఇదే జరిగితే నితిన్ తో దిల్ రాజుకి ఇది మూడో సినిమా అవుతుంది. ఇంతముందు దిల్, శ్రీనివాసకళ్యాణం సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. దిల్ సినిమా ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఇందులో శ్రీనివాస కళ్యాణం మాత్రం నిరాశ పరిచింది.