'90 ML' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: కార్తికేయ,నేహా సోలంకి,రవికిషన్‌,రావూ రమేష్‌,అలీ,పోసాని కృష్ణమురళి తదితరులు.
దర్శకత్వం: శేఖర్‌ రెడ్డి
నిర్మాతలు: అశోక్ రెడ్డి గుమ్మకొండ 
సంగీతం: అనూప్ రూబెన్స్ 
విడుదల తేదీ: డిసెంబర్ 6,  2019

 

రేటింగ్‌: 2/5

 

ఆర్‌.ఎక్స్ 100తో క‌థానాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ‌. ఆ సినిమా చిన్న చిత్రాల‌కు ఊపునిచ్చింది. కొత్త క‌థ‌ల‌కు ఊపిరి పోసింది. అయితే ఆ త‌ర‌వాత కార్తికేయ‌కు స‌రైన విజ‌యం ల‌భించ‌లేదు. గుణ 369 బోల్తా కొట్టింది. హిప్పీ ఆడ‌లేదు. విల‌న్‌గా మారి చేసిన ప్ర‌య‌త్నం కూడా నెర‌వేర‌లేదు. ఈనేప‌థ్యంలో మ‌ళ్లీ త‌న సొంత నిర్మాణ సంస్థ‌లోనే `90 ఎం.ఎల్‌` రూపొందించాడు. మ‌రి ఈ సినిమా అయినా కార్తికేయ‌కు హిట్ ఇచ్చిందా?  90 ఎం.ఎల్ లో ఉన్న కిక్ ఎంత‌?
 


* క‌థ‌

 

పార్వ‌తీ న‌గ‌ర్‌లోని దేవ‌దాస్ (కార్తికేయ‌)కి చిన్న‌ప్ప‌టి నుంచీ ఓ విచిత్ర‌మైన స‌మ‌స్య ఉంది. మందు తాగితే గానీ త‌న బండి న‌వ‌డ‌దు. కొంత‌మందికి మ‌ద్య‌పానం వ్య‌స‌నం. త‌న‌కు మాత్రం అవ‌స‌రం. పూట‌కు 90 ఎం.ఎల్ తాగాల్సిందే. కాక‌పోతే చ‌దువులో ఫ‌స్టు. ఎంబీఏ గోల్డ్ మెడ‌ల్ తెచ్చుకుంటాడు. అయితే.. ఉద్యోగం మాత్రం రాదు. ఓ పిల్లాడిని అత్యంత సాహ‌స‌వంతంగా ర‌క్షించి యూ ట్యూబ్‌లో పాపుల‌ర్ అవుతాడు దేవ‌దాస్‌. త‌న సాహ‌స‌కృత్యాలు చూసి సువాస‌న (సోలంకి) ప్రేమ‌లో ప‌డిపోతుంది. సోలంకి సేవాభావం దేవ‌దాసుకి న‌చ్చుతుంది. కానీ సువాస‌న‌కు ఆల్క‌హాల్ తాగేవాళ్లంటే అస్స‌లు ప‌డ‌దు. అందుకే తాను ఆర్థ‌రైజ్డ్ డ్రింక‌ర్ అనే విష‌యాన్ని సువాస‌న ద‌గ్గ‌ర దాస్తాడు. దాని వ‌ల్ల వ‌చ్చిన పరిణామాలేంటి?  ఈ జ‌బ్బు ప్రేమికుల్ని ఎలా దూరం చేసింది?  అనేదే క‌థ‌.

 

* న‌టీన‌టులు


కార్తికేయ‌లో మంచి ఫైర్ ఉంది. కానీ ఇలాంటి క‌థ‌ల్లో దాన్ని ప్ర‌ద‌ర్శించాల‌నుకోవ‌డం త‌ప్పు. ఎంత క‌ష్ట‌ప‌డినా అది బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుంది. డాన్సులు బాగా చేశాడు. యాక్ష‌న్ సన్నివేశాల్లో రాణించాడు. కానీ... అది మాత్రం స‌రిపోదు క‌దా. సోలంకి అక్క‌డ‌క్క‌డ చూడ్డానికి బాగుంది. ర‌వికిష‌న్ ఓవ‌రాక్ష‌న్ భ‌రించాల్సిందే. రావు ర‌మేష్ ఓకే అనిపిస్తాడు. రోల్ రైడా.. అస‌లు ఏమాత్రం మెప్పించ‌లేక‌పో్యాడు. 
 

* సాంకేతిక వ‌ర్గం


అనూప్ పాట‌లు బాగున్నా - క‌థలో మాత్రం స్పీడ్ బ్రేక‌ర్లుగా నిలిచాయి. ఏకంగా రెండు పేథాస్ గీతాలున్నాయి. సినిమా ఎప్పుడైపోతుందా, అని ఎదురు చూస్తున్న స‌మ‌యంలో వ‌చ్చే ఆ పాట‌లు ప్రేక్ష‌కుల  స‌హ‌నాన్ని ప‌రీక్ష పెడ‌తాయి. క‌థ చాలా బ‌ల‌హీనంగా ఉంది. క‌థ‌నం అంత‌కంటే నీర‌సంగా త‌యారైంది. దాంతో ఎంత హంగామా చేసినా ఆన‌లేదు.

 

* విశ్లేష‌ణ‌

 

ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్‌లో ఆస‌క్తి ఉంది. సాధార‌ణంగా ఇంటికి తాగి వ‌స్తే త‌ల్లిదండ్రులు మంద‌లిస్తారు. కానీ ఇక్క‌డ మాత్రం `నువ్వు తాగ‌క‌పోతే.. నేను నా చేయి కోసుకుంటా` అని త‌ల్లి త‌న కొడుకుని బెదిరిస్తుంటుంది. ప‌రిస్థితి అలాంటిది. ఉద‌యాన్నే ఎవ‌రైనా కాఫీ తాగుతారు. కానీ హీరో మాత్రం స‌ర‌దాగా ఓ పెగ్గు తీసుకుంటాడు. క్యారెక్ట‌రైజేష‌న్ అలా ఉంటుంది. దీని చుట్టూ కావ‌ల్సినంత వినోదం పండుతుంది. ఆ ధీమాతోనే నిర్మాత‌, హీరో ఈసినిమాని ఓకే చేసి ఉంటారు.  అయితే హీరో క్యారెక్ట‌రైజేష‌న్ మాత్ర‌మే కొత్త‌గా ఉంటే స‌రిపోదు. దాని చుట్టూ ఉన్న పాత్ర‌ల‌కూ కిక్ ఇవ్వాలి. మిగిలిన స‌న్నివేశాల్లోనూ కొత్త‌ద‌నం క‌నిపించాలి. అయితే 90 ఎం.ఎల్ నుంచి అవేమీ ఆశించ‌కూడ‌దు.


క‌థానాయ‌కుడి పాత్ర ప‌రిచ‌యం, త‌న సాహ‌సాలు, అవి చూసి క‌థానాయిక ప్రేమ‌లో ప‌డ‌డం - వాళ్లిద్ద‌రి ల‌వ్ ట్రాక్ ఇవ‌న్నీ ప‌ర‌మ రొటీన్ గా సాగిపోతాయి. క‌థానాయ‌కుడి జీవితంలో విల‌న్లు (అజ‌య్‌, ర‌వికిష‌న్‌) ప్ర‌వేశించ‌డం కూడా చాలా సినిమాటిక్‌గా జ‌రిగిపోతుంది. `నేను ఆర్థ‌రైజ్డ్ డీల‌ర్‌` అనే విష‌యాన్ని అంద‌రికీ స‌గ‌ర్వంగా చెప్పుకునే హీరో - క‌థానాయిక ద‌గ్గ‌ర మాత్రం ఈ విష‌యం దాస్తాడు. అలా దాయ‌క‌పోతే క‌థ అక్క‌డితే ఆగిపోతుంది కాబ‌ట్టి త‌ప్ప‌లేదు. అక్క‌డే సినిమా లాజిక్కు పోయింది. ర‌వికిష‌న్ పాత్ర‌ని అటు కామెడీకీ, ఇటు విల‌నిజానికీ దూరంగా డిజైన్ చేశారు. ఆ పాత్ర‌పై ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి ఫీలింగూ క‌ల‌గ‌దు. అజ‌య్ కేవ‌లం హీరో చేతిలో త‌న్నులు తిన‌డానికే వ‌స్తాడు. పోలీస్‌స్టేష‌న్ ఎపిసోడూ, క్లైమాక్సూ.. ఇలా ఏదీ కిక్ ఇవ్వ‌దు. ఒక్క మాట‌లో చెప్పాలంటే - మంచినీళ్లు ఇచ్చి దాన్నే ఆల్క‌హాల్ అనుకోమంటే ఎలా ఉంటుందో.. ఈ సినిమా అలా వుంది. అటు కామెడీకీ ఇటు ఎమోష‌న్‌కీ, ల‌వ్ స్టోరీకీ దూర‌మైన క‌థ‌లా త‌యారైంది.

 

* ప్ల‌స్ పాయింట్స్‌ 

టైటిల్‌
హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌

* మైన‌స్ పాయింట్స్

క‌థ‌
క‌థ‌నం
స‌న్నివేశాల సాగ‌దీత‌
 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: క‌ల్తీ స‌రుకు.

- రివ్యూ రాసింది శ్రీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS