కాస్టింగ్ కౌచ్... ఈ బారీన పడని హీరోయిన్ లేదనడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఒక్కరికీ ఇలాంటి చేదు అనుభవాలుంటాయి. స్టార్ హీరోయిన్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాకపోతే కొంతమంది చెప్పుకొంటారు.. ఇంకొంతమంది మనసులోనే దాచుకొని మదన పడతారు. బాలీవుడ్ స్టార్ నాయిక విద్యాబాలన్ కి సైతం ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయట. ఈ విషయాన్ని తానే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఓ యాడ్ ఫిల్మ్ లో నటిస్తున్నప్పుడు దర్శకుడు కాఫీ షాప్‌కి రమ్మన్నాడని, అక్కడకు వెళ్తే... `రూమ్ లోకి వెళ్లి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం` అని తన గదికి తీసుకెళ్లాడని, కానీ తాను చాలా తెలివిగా వ్యవహరించడం వల్ల... ఆ దర్శకుడి నుంచి తప్పించుకోగలిగానని సంచలన కామెంట్లు చేసింది విద్యాబాలన్. అయితే ఆ దర్శకుడి పేరు మాత్రం వెల్లడించడానికి ఇష్టపడలేదు.
''ఇండస్ట్రీకి రాక ముందే.. కాస్లింగ్ కౌచ్ గురించి విన్నాను. అందుకే నేను ప్రతీసారీ జాగ్రత్తగా ఉండేదాన్ని. ఓసారి నేను కాస్టింగ్ కౌచ్‌కి బలయ్యేదాన్నే. దర్శకుడు నన్ను తన గదికి రమ్మన్నాడు. నేను ఎందుకైనా మంచిదని గది తలుపులు తెరిచే ఉంచా. తనకు ఏం చేయాలో అర్థం కాక, అక్కడి నుంచి వెళ్లిపోయాడు..అలా నేను తప్పించుకొన్నా'' అని చెప్పుకొచ్చింది విద్యాబాలన్.