భవిష్యత్తు అంతా ఓటీటీలదే అని అగ్ర నిర్మాతలు బల్ల గుద్ది చెబుతున్నారు. చిత్రసీమ కూడా అందుకు అనుగుణంగానే ప్రిపేర్ అవుతోంది. పెద్ద దర్శకులు సైతం ఓటీటీ వైపు కాలు పెట్టడానికి చూస్తున్నారు. ఇప్పుడు మురుగదాస్ అదే చేస్తున్నాడు. ఓ వెబ్ సిరీస్‌ని నిర్మించడానికి రెడీ అయ్యాడు. తన శిష్యుడికి దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తూ.. మురుగదాస్ ఓ వెబ్ సిరీస్‌ని నిర్మిస్తున్నాడు. ఇది లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. వాణీ భోజన్ ఈ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తోంది.
తమిళ నాట వాణీ సుప్రసిద్ధమైన టీవీ యాంకర్. కొన్ని సినిమాల్లోనూ నటించింది. వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ పోషించడం ఇదే తొలిసారి. నిజానికి ఈ కథతో సినిమా తీద్దామనుకున్నాడట మురుగదాస్. అయితే.. ఇప్పుడు సినిమా అంటే వెబ్ సిరీస్‌లకే ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. మురుగదాస్ కథలన్ని వైవిధ్యంగానే ఉంటాయి. ఆయన శిష్యులు కూడా మురుగదాస్ లానే ఆలోచిస్తారు. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతోందో?