నటీనటులు : రామ్ మిట్టకంటి , అమిత రంగనాథ్, శ్రీజిత్, జేడీ చేకూరు తదితరులు
దర్శకత్వం : సురేందర్ కే
నిర్మాతలు : ఎస్ ఎన్ రెడ్డి
సంగీతం : ఎన్ ఎస్ ప్రసు
సినిమాటోగ్రఫర్ : సంతోష్ శనమొని
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
రేటింగ్: 2.5/5
లాక్ డౌన్ వల్ల థియేటర్లన్నీ మూతబడ్డాయి. శుక్రవారం సినిమాల హడావుడి లేదు. కొత్త పోస్టర్ల కళకళలు లేవు. వినోదమంతా బుల్లి తెరకు షిప్ట్ అయ్యింది. ఓటీటీ వేదికలే పెద్ద దిక్కుగా మారాయి. ఓటీటీ సంస్థలు కూడా విడుదలకు నోచుకోని సినిమాల్ని ఆకర్షించడానికి సిద్ధమయ్యాయి. ఫ్యాన్సీ రేట్లు ఆశ చూపి, సినిమాల్ని కొనడానికి ప్రయత్నించాయి. అందులో భాగంగా నేరుగా ఓటీటీలోనే విడుదలైన సినిమా `అమృతరామమ్`. అన్నీ బాగుంటే.. లాక్ డౌన్ లేకపోతే, థియేటర్లలో విడుదల కావల్సిన సినిమా. ఇప్పుడు నేరుగా జీ 5లో దర్శనమిచ్చింది. ఈరోజు నుంచే స్ట్రీమింగ్ మొదలైంది. మరి.. `అమృత రామమ్` ఎలా వుంది? ఈ ప్రేమ కథ ఎవరికి నచ్చుతుంది?
* కథ
రామ్ (రామ్) ఆస్ట్రేలియా వెళ్లి, అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. తనకు నచ్చిన ఉద్యోగం దొరక్కపోవడంతో ఖాళీగా గడిపేస్తుంటాడు. అక్కడికి చదువుకోవడానికి వస్తుంది అమృత (అమృత). ఎయిర్ పోర్టులో తొలి చూపులోనే రామ్ ని ఇష్టపడుతుంది. అది ప్రేమగా మారుతుంది. రోజు రోజుకీ రామ్ పై ప్రేమ ఎక్కువవుతుంది. అమృత ప్రేమని రామ్ అర్థం చేసుకుంటాడు. ఇద్దరూ కొన్నాళ్లు సహ జీవనం చేస్తారు. అయితే ఆ ప్రయాణంలో.. ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వస్తాయి. అమృత మితిమీరిన ప్రేమ, కేరింగ్... భరించలేకపోతాడు రామ్. దాంతో గొడవలు పెద్దవవుతాయి. ఇద్దరూ విడిపోతారు. మళ్లీ వీళ్లెలా కలుసుకున్నారు? అమృత ప్రేమని రామ్ ఎప్పుడు సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు? తన ప్రేమని గెలిపించుకోవడానికి అమృత చేసిన త్యాగం ఏమిటి? ఈ ప్రశ్నలకు పమాధానం తెలియాలంటే `అమృత రామమ్` చూడాల్సిందే.
* విశ్లేషణ
ప్రేమకథలేవీ కొత్తగా ఉండవు. వాటిని వ్యక్త పరిచే విధానం కొత్తగా అనిపిస్తే చాలు. ప్రేమలోని స్వచ్ఛత, నిజాయతీ పరిపూర్ణంగా ఆవిష్కరిస్తే చాలు. అలాంటి ప్రేమకథలు విజయవంతం అయిపోతాయి. అమృత రామమ్ కథలో కొత్తదనం ఏమీ ఉండదు. ఇద్దరి మధ్య ప్రేమ, వాళ్ల మధ్య వచ్చే ఈగో సమస్యలు.. విడిపోవడాలు, మళ్లీ కలుసుకోవడం. అంతే. అయితే.. ఈ కథకి ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్‌ని ఎంచుకున్నాడు దర్శకుడు. ఆ ఫ్రేముల మధ్య ఈ పాత కథ కాస్త అందంగా మెరుస్తుంటుంది.
మితిమీరిన మెలోడ్రామాలేం లేకుండా చూసుకోవడంతో సన్నివేశాలు పాస్ అయిపోతుంటాయి. అయితే ఏ సీన్ కూడా ప్రేక్షకుడిపై బలమైన ముద్ర మాత్రం వేయలేదు. అమృత రామ్ ని ఎందుకు అంత గాఢంగా ప్రేమించింది? అనే విషయానికి సమాధానం దొరకదు. `లవ్ ఎట్ ఫస్ట్ సైట్` అని కథానాయికతో చెప్పించారు. అయితే.. ఎంత లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయినా, అంత గాఢంగా ప్రేమించడం వెనుక బలమైన కారణం ఉంటే బాగుంటుంది కదా?
`అసలు రామ్‌ని అమృత ఎందుకు ఇంతలా ప్రేమిస్తుంది. అంతలా ఏముంది రామ్ లో` ఈ ప్రశ్న సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుడికి ఎదురవుతూనే ఉంటుంది. దర్శకుడికి తన కారణాలు తనకు ఉండొచ్చు. కానీ... వాటిని ప్రేక్షకుడికి సైతం అర్థమయ్యేలా చెప్పగలగాలి. అప్పుడే ఆ ప్రేమకథతో, ఆ పాత్రలతో ప్రేక్షకుడు సైతం ప్రయాణం చేస్తాడు. తెర పై చూస్తున్న ప్రేమ సఫలీకృతం కావాలని అనుకుంటాడు. అలా అనుకుంటే ఆ కథలో నిజాయతీ ఉన్నట్టే. కానీ `అమృత రామమ్` సినిమా విషయంలో అవేం కనిపించవు. హీరో, హీరోయిన్ లు తప్ప ఈ కథ లో ఎవరి పాత్ర కీ పెద్దగా స్కోప్ ఉండదు.
రెండు పాత్రలే చూస్తుండడం, ఒకే ఎమోషన్ తో సినిమా నడుస్తుండడంతో విసుగు మొదలవుతుంది. ద్వితీయార్థంలో దర్శకుడు కాస్త ప్రతిభ చూపించాడు. ఎమోషన్‌ని పక్కాగా ప్లేస్‌మెంట్ చేశాడు. క్లైమాక్స్‌కి ముందు కథలోని అసలైన అర్థ్రత బయటకు వస్తుంది. పతాక సన్నివేశాలు కదిలిస్తాయి. ఈ కథకి ప్రాణం అంతా అక్కడే ఉందనిపిస్తుంది. అయితే... ఈ క్లైమాక్స్ ఇటీవల వచ్చిన `ఇద్దరి లోకం ఒకటే` క్లైమాక్స్‌ని తలపిస్తుంది. అచ్చు గుద్దినట్టు రెండు సినిమాల ముగింపూ ఒక్కటే. బహుశా.. ఈ ఇద్దరు దర్శకులు ఒకేలా ఆలోచించి ఉంటారు. లేదంటే ఒకే హాలీవుడ్ సినిమా చూసి స్ఫూర్తి పొంది ఉంటారు.
* నటీనటులు
రామ్, అమృత... ఇద్దరికీ ఇదే తొలి సినిమా. వీరిద్దరూ హీరో, హీరోయిన్లు అని మనసు ఒప్పుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. ఆ తరవాత.. కథతో పాటు ప్రయాణం చేయగలిగితే, ఆ పాత్రల్ని అర్థం చేసుకుంటే.. కాస్త ఉపశమనం కలుగుతుంది. అమృత గ్లామర్ హీరోయిన్ ఏమీ కాదు. అలాగని రామ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అంత గొప్పగా లేదు. ఈ స్థానంలో ఓ అందమైన జంటని తీసుకుని ఉంటే, ఫలితం బాగుండేది. నటన పరంగానూ ఇద్దరికీ యావరేజ్ మార్కులే పడతాయి.
* సాంకేతిక వర్గం
ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. బహుశా ఆస్ట్రేలియాలో తీయడం వల్ల కొత్త లుక్ వచ్చి ఉంటుంది. అనవసరమైన కామెడీ ట్రాక్ ల జోలికి వెళ్లలేదు దర్శకుడు. దాంతో రెండు గంటల్లో సినిమా తేలిపోయింది. పతాక సన్నివేశాలు మినహా మెరుపుల్లేవు. కానీ.. అది కూడా ఇటీవల వచ్చిన ఓ తెలుగు సినిమాని గుర్తు చేయడం వల్ల, ఆ ప్రత్యేకతని కోల్పోవాల్సివచవ్చింది. పాటలు ఓకే అనిపిస్తాయి.
* ప్లస్ పాయింట్స్
నేపథ్యం
లొలొకేషన్లు
పతాక సన్నివేశాలు
* మైనస్ పాయింట్స్
నాయకా నాయికలు
బోరింగ్ స్క్రీన్ ప్లే
* ఫైనల్ వర్డిక్ట్: ఇద్దరి లోకం ఒక్కటే