సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లో ఉండే విపరీత పోకడలు, బంధుప్రీతిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు నిర్మాతలు, స్టార్ హీరోలు బయటి వారిని ఎదగనివ్వకుండా అణగదొక్కుతున్నారని తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. చాలామంది సెలబ్రిటీలు ఈ విషయంలో విమర్శలు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ నవలా రచయిత చేతన్ భగత్ బాలీవుడ్ లో ఉండే పోటీపై తనకు ఎఆర్ రెహమాన్ ఇచ్చిన సలహా గురించి చెప్పుకొచ్చారు.
చేతన్ భగత్ రాసిన పలు పుస్తకాలను బాలీవుడ్ లో సినిమాలుగా తెరకెక్కించారు. 'హలో', 'కై పో చే', '3 ఇడియట్స్' సినిమాలు ఆయన నవలల ఆధారంగా రూపొందినవే. ఈ మూడు సినిమాలకు ఆయన రైటింగ్ డిపార్ట్మెంట్ లో పని చేశారు. ఒక సందర్భంలో ఆయన రెహమాన్ తో ముచ్చటిస్తున్నప్పుడు బాలీవుడ్ తనను విపరీతంగా భయపెడుతుందని చేతన్ అన్నారట. దీనికి రెహమాన్ తన అనుభవసారం రంగరించి ఇలా చెప్పారట "బాలీవుడ్ అనేది ఓ అందమైన కొలను. అయితే అందులో భయంకరమైన మొసళ్లు కూడా ఉంటాయి. అందుకే, కొలనులో ఒక మూల నిలుచుని స్నానం చేస్తే ఏం ఫరవాలేదు. ఎప్పుడూ ఫుల్లుగా మునిగి ఈత కొట్టకూడదు. ఎప్పుడూ ఒక కాలు లోపల, ఒక కాలు బయట అన్నట్టుండాలి."
బాలీవుడ్ లో కాంపిటీషన్ సాధారణ స్థాయిలో ఉండదు. ఆ ఒత్తిడిని ఎక్కువమంది తట్టుకోలేరు. పూర్తిగా మునిగిపోయి మొసళ్ల చేతికి చిక్కేదానికంటే రెహమాన్ సారు చెప్పినట్టు లౌక్యంగా ఉండాలి. ఒక కాలు ఎప్పుడూ బయట పెట్టుకోవాలి అంటే 'ఉస్కో అంటే ఎస్కేప్' అయ్యేందుకు రెడీగా ఉండాలన్నమాట.