ఒక సినిమాతో ముగ్గురి కెరీర్‌లు రివర్స్ గేర్‌లోకి వెళ్లిపోయాయి.. ఆ సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అయితే ఆ ముగ్గురూ ఇంద్రగంటి మోహనకృష్ణ, సుధీర్ బాబు, కృతి శెట్టి. ఈ ఫ్లాప్ వీళ్ల ముగ్గురి కెరీర్ పై పెను ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉంది.
ముందు ఇంద్రగంటి గురించి మాట్లాడుకుందాం. తను ఓ క్లాస్ డైరెక్టర్. సున్నితమైన భావోద్వేగాల్ని అద్భుతంగా పండించగలడు. తన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అయితే... ఇవేం.. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'లో కనిపించలేదు. ఇంద్రగంటి కెరీర్‌లో ఫ్లాపులు ఉన్నాయి కానీ, సినిమాలో ఏదో ఓ కోణంలో ఇంద్రగంటి మ్యాజిక్‌ని చూసే అవకాశం దక్కేది. `ఆ అమ్మాయి`లో అవేం లేవు. సినిమా పరిశ్రమపై చాలా సెటైర్లు పడ్డాయి... ఈ సినిమాలో. కథలు తయారు చేయడం, కాంబినేషన్లు సెట్ చేయడం, అవసరం ఉన్నా, లేకున్నా ఐటెమ్ సాంగ్‌ని పెట్టేయడం, నిర్మాతలకు `నో` చెప్పడంలో హీరోలు అనుభవించే ఆనందం, కమిట్‌మెంట్ల గొడవ.. ఇలా ఒక్కటేమిటి అన్ని యాంగిల్స్‌లోనూ టచ్ చేశారు. నిజానికి సినిమా బాగుంటే వీటన్నింటి గురించి జనం పాజిటీవ్‌గా మాట్లాడుకొనేవారు. సినిమానే తేడా కొట్టేసరికి... ఆ సెటైర్లే ఇంద్రగంటిపై రివర్స్ లో పనిచేశాయి. ఈ సినిమా ఇంద్రగంటి తనపై తనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో తీశాడేమో అనిపించేంతలా ఉంది. ఇంద్రగంటి మంచి హిట్లు కొట్టినా బిగ్ లీగ్ లోకి వెళ్లలేకపోయాడు. పెద్ద హీరోలతో సినిమాలకు తనెప్పుడూ ఆమడ దూరంలోనే ఉన్నాడు. ఈ ఫ్లాపుతో మీడియం రేంజు హీరోలైనా ఇంద్రగంటిని పట్టించుకొంటారా, లేదా? అనేది అనుమానంగా మారింది.
ఇక హీరో సంగతికి వద్దాం. సుధీర్ బాబుకి దిమ్మతిరిగే హిట్లేం లేవు. అన్నీ యావరేజ్, బిలో యావరేజ్ సినిమాలే. అందులో `సమ్మోహనం` ఒకటి. ఆ నమ్మకంతోనే ఇంద్రగంటికి మరో ఛాన్స్ ఇచ్చి ఉంటాడు సుధీర్. నటుడిగా ఓకే. కానీ స్క్రిప్టు సెలక్షన్‌లో కాస్త కఠినంగా ఉంటేనే హీరోల కెరీర్‌లు గాడిన పడతాయి. ఈ విషయంలో సుధీర్ ఓసారి తనని తాను ఆత్మ విమర్శ చేసుకోవాలి. సుధీర్ మంచి నటుడే. కానీ.. కొన్ని సన్నివేశాల్ని మరీ ఓవర్ డ్రమటైజ్ చేసి, తనలోని నటుడ్ని బలవంతంగా బయటకు రప్పించే ప్రయత్నమైతే చేస్తున్నాడు.`ఆ అమ్మాయి..`లో అది స్పష్టంగా కనిపించింది.
ఉప్పెనతో కృతిశెట్టికి గొప్ప ఓపెనింగ్ దొరికింది. ఉప్పెన చూసే ఆమెకు గంపెడు అవకాశాలు కట్టబెట్టేసింది టాలీవుడ్. కానీ ఉప్పెన తరవాత ఏ సినిమాలోనూ తను మెప్పించలేకపోయింది. బంగార్రాజు మినహా కృతికి ఒక్క కమర్షియల్ హిట్ కూడా దక్కలేదు. ఆ హిట్టయిన బంగార్రాజులోనూ కృతి చేసిందేం ఉండదు. కథల ఎంపికలో కృతి పూర్ అనే సంగతి ప్రతీసారీ రుజువవుతూనే ఉంది. యాక్టింగ్‌లో తన మైనన్సులు చాలా ఉన్నాయి. వాటిని అస్సలు ఇంప్రూవ్ చేసుకోవడం లేదు. ఇదే కొనసాగితే కృతి కెరీర్ అతి త్వరలోనే చమరాంకంలో పడే ప్రమాదం ఉంది.