లవ్ స్టోరీలు తీయడంలో గౌతమ్ మీనన్ తరవాతే ఎవరైనా. యాక్షన్ సినిమాల్నీ ఆయన విరివిగానే తీశారు. అయితే... కొంతకాలంగా ఆయన దర్శకత్వం కంటే నటనపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఇప్పుడు మెల్లగా... మళ్లీ దర్శకత్వం వైపు ఫోకస్ చేస్తున్నారు. తెలుగు హీరోలతో ఆయన సినిమాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే రామ్ తో ఓ సినిమా చేస్తారని ఇండస్ట్రీ వర్గాల టాక్. రామ్ తో మాత్రమే కాదు... మహేష్ బాబు, రామ్ చరణ్‌లతో కూడా సినిమాలు చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో మహేష్ తో ఓ సినిమా చేద్దామనుకొన్నారు. కానీ అది కుదర్లేదు. ఆ కథే... నాగ చైతన్యతో `ఏం మాయ చేశావె`గా తెరకెక్కించి, సూపర్ హిట్ కొట్టారు. రామ్ చరణ్ తో సినిమా కూడా పైప్ లైన్‌లోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరు హీరోలతో సినిమా చేయడానికి గౌతమ్ మీనన్ చకచక వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
''ఇది వరకే మహేష్, చరణ్ లతో పనిచేయాల్సింది. కానీ కుదర్లేదు. అయితే... నా ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఎప్పుడైనా మా సినిమాలు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి'' అని క్లారిటీ ఇచ్చారు గౌతమ్ మీనన్. తమిళ దర్శకులకు మన హీరోలు విరివిగానే అవకాశాలు ఇస్తున్నారు.పాన్ ఇండియా హంగామా మొదలయ్యాక అది మరింత ఎక్కువైంది. సో.. గౌతమ్‌కి ఎప్పుడైనా, ఏ హీరో నుంచైనా పిలుపు వచ్చేయొచ్చు.