ఆది పినిశెట్టి మంచి నటుడు. హీరో పాత్రలు చేస్తూనే విలన్ గానూ తన మార్క్ చాటుకున్నాడు. మంచి కథ చెప్పడానికి తనూ ఎప్పుడూ సిద్దమేనని చెబుతూ తాజాగా 'క్లాప్' అనే సినిమా చేశాడు. ఇది నేరుగా సోనీ లీవ్ లో విడుదలైయింది.
స్పోర్ట్స్ డ్రామాగా సాగే సినిమాలో ఒక కాలు కోల్పోయిన అథ్లెట్ గా కనిపించాడు. మంచి పాత్ర. ఆది చక్కగా చేశాడు. సినిమా పాయింట్ బావుంది. ప్రమాదవశాత్తు ఓ కాలుని కోల్పోయిన అథ్లెట్ తన కలని ఎలా పూర్తి చేసుకున్నాడనేది కథ. అయితే చాలా పరిమిత బడ్జెట్ తో తీసిన సినిమా కావడంతో సినిమాటిక్ అనుభూతి ఇవ్వడంలో కొంచెం ఇబ్బంది కనిపించింది. అయితే నటన పరంగా ఆదితో పాటు సినిమాలో నటించిన అందరికీ మంచి మార్కులు పడతాయి. ఇళయరాజా సంగీతం క్లాప్ కి ఒక ప్లస్ పాయింట్. రెండు పాటలు, నేపధ్య సంగీతం బావున్నాయి. ప్రకాష్ రాజ్, నాజర్, ఆకాంక్ష సింగ్, భాగ్యలక్ష్మీ పాత్ర చేసిన కృష్ణ కురుప్ చక్కగా నటించారు. అయితే చిత్రీకరణ, స్పోర్ట్స్ చుట్టూ వున్న రాజకీయం ఇంకాస్త బలంగా చేసివుంటే ఫలితం ఇంకా బావుండేది. ఏదేమైనా ఇలాంటి పాత్ర చేయడానికి ముందుకు వచ్చిన ఆదిని అభినందించాలి. సినిమా ఓటీటీలో వుంది కాబట్టి సమయం కుదిరినప్పుడు ఓసారి చూడొచ్చు.