ఈమధ్య సినిమా వాళ్లు ఏం చేసినా, ఎవరివో ఒకరి మనో భావాలు దెబ్బతింటూనే ఉన్నాయి. పాటలో పదాలో, డైలాగుల్లో వాక్యాలో పట్టుకుని `మా మనోభావాలు దెబ్బతిన్నాయ్` అంటూ గోల చేస్తున్నారు. ఓరకంగా అది కూడా సినిమాలకు పబ్లిసిటీగానే ఉపయోగపడుతోంది. తాజాగా.. `ఆచార్య`పై ఆర్.ఎం.పీ. డాక్టర్లకు కోపం వచ్చింది.
ఈ సినిమాలోని `శానా కష్టం` అనే పాట ఇటీవలే విడుదలైంది. మణిశర్మ ట్యూను... దానికి చిరు వేసిన స్టెప్పులు, రెజీగా గ్లామర్ - ఇవన్నీ తోడై.. ఆ పాటని సూపర్ హిట్ చేశాయి. అయితే.. ఈ పాటలోని ఓ వాక్యం ఆర్.ఎం.పీలకు కోపం వచ్చేలా చేసింది. చరణంలోని ఓ చోట `ఏదేదో నిమరొచ్చని కుర్రాళ్లు ఆర్.ఎం.పీలు ఐపోతున్నారే` అనే ఓ సరదా వాక్యం ఉంది. ఇప్పుడు అది పట్టుకుని ఆర్.ఎం.పీలు గొడవ చేస్తున్నారు. తెలంగాణలోని జనగాంకి చెందిన ఆర్.ఎం.పీ డాక్టర్ అసోసియేషన్ ఈ పాటపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ పదం తొలగించి, ఆర్.ఎం.పీలకు చిత్రబృందం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మరి... ఆచార్య నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.