ఆచార్య ఎంత పెద్ద డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసినిమాతో కొరటాల శివ తాను ఇన్నాళ్లూ కష్టపడి సంపాదించుకొన్న ఇమేజ్ పోగొట్టుకొన్నాడు. ఈ సినిమా ఆర్థిక వ్యవహరాలన్నీ తన నెత్తిమీద వేసుకోవడం వల్ల... బయ్యర్లకు తన సొంత డబ్బు తిరిగి కట్టాల్సి వచ్చింది. అయితే.. ఇప్పుడు చిరంజీవి కామెంట్లతో కొరటాల పేరు మరోసారి బయటకు వస్తోంది. విషయం ఏమిటంటే.. `లాల్ సింగ్ చద్దా` ప్రమోషన్‌లో భాగంగా చిరంజీవి ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ... దర్శకుల పనితీరుపై చిరు చురకలు అంటించారు. కొంతమంది దర్శకులు సెట్లోనే డైలాగులు రాస్తున్నారని, అది నటీనటులకు ఇబ్బంది కలిగించే అంశమని, నటనపై దృష్టి పెట్టాలా, లేదంటే ఆ సమయంలో డైలాగులు నేర్చుకోవడం కోసం ఆలోచించాలా? అంటూ.. సెట్లో తమ అవస్థల గురించి ప్రస్తావించారు.
కొరటాల శివని దృష్టిలో ఉంచుకొనే చిరు ఈ వ్యాఖ్యలు చేశారని ఇప్పుడు టాలీవుడ్ కోడై కూస్తోంది. కొరటాలకు కూడా సెట్లో డైలాగులు రాసే అలవాటు ఉంది. సో.. ఆచార్య సెట్లో ఇలాంటి వ్యవహారాలే జరిగి ఉంటాయని, చిరు ఇప్పుడు వాటిని ప్రస్తావించారని అంటున్నారు. అలా.. ఆచార్య డిజాస్టర్‌ని కొరటాలపై నెట్టేసినట్టయ్యింది. నిజానికి కొరటాల ఒక్కడే కాదు. చాలా మందికి సెట్లో డైలాగులు రాసే అలవాటు ఉంది. త్రివిక్రమ్, సుకుమార్‌లూ ఇదే చేస్తుంటారు. అయితే... ఎవరైనా సరే, హిట్టు కొట్టేంత వరకూ అన్నీ బాగానే ఉంటాయి. ఒక్క ఫ్లాపయితే.. తప్పులన్నీ ఇలా బయటపడుతుంటాయి. అంతే.