మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆగస్టు 22వ తారీఖున 'ఆచార్య' సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ముఖ్యంగా మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం మరోసారి ఆకర్షణగా నిలిచింది. ఇదిలా ఉంటే 'ఆచార్య' టీం నుంచి త్వరలోనే మరొక అప్డేట్ రానుందని సమాచారం అందుతోంది.
దసరా సీజన్ సందర్భంగా 'ఆచార్య' చిత్రం నుంచి ఒక పాటను రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. మణిశర్మ ఇప్పటికే ఈ చిత్రానికి మంచి ట్యూన్లు కంపోజ్ చేశారని, అందులో నుంచి ఒక పాటను దసరా కానుకగా రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట. మొదటి టీజర్ రిలీజ్ చేద్దామని ఆలోచన ఉన్నప్పటికీ సినిమా రిలీజుకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఆలోచన విరమించుకుని ఒక లిరికల్ సాంగ్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారట.
100% సక్సెస్ రేట్ ఉన్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.