2022లోనే అతి పెద్ద ఫ్లాప్ గా మిగిలింది ఆచార్య. తొలి మూడు రోజుల్లో దాదాపు 40 కోట్లు తెచ్చుకుంది. సోమవారం నుంచి వసూళ్లు మరింత దారుణంగా పడిపోయాయి. కనీసం రెంట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. మంగళవారం రంజాన్ పండుగ కలిసొస్తుందని అంతా అనుకున్నారు. కానీ... ఆ ఆశలూ ఆడియాశలుగా మారిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా నష్టమెంతో లెక్కేసుకోవాల్సిన పరిస్థితి. ఈ సినిమాని భారీ రేట్లకు కొని, నష్టపోయినవాళ్లని ఆదుకోవాల్సిన అవసరం వచ్చాయి. ఇప్పటికే చాలామంది డిస్టిబ్యూటర్లు.. చిరుకి టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. `మమ్మల్ని ఏదోలా ఆదుకోండి` అని వేడుకున్నట్టు సమాచారం అందుతోంది. దానికి చిరు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
ఈ సినిమా చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే సింహ భాగం వాటా మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ పెట్టింది. చిరు, చరణ్‌లు తమ పారితోషికాల్ని సైతం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ పారితోషికాల్లో కొంత వాటా తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఒక్కో బయ్యర్ దాదాపు 70 శాతం నష్టపోతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అంతా ఇవ్వకపోయినా.. కనీసం 25 శాతం తిరిగి ఇవ్వాలని చిరు భావిస్తున్నాడట. అలా.. తిరిగి ఇచ్చినా - బయ్యర్లు కాస్తో కూస్తో ఊపిరి పీల్చుకొనే అవకాశం ఉంది.