ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు క్లాష్ అవ్వడం ఈమధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. భారీ సినిమాలు రెండూ ఒకే రోజు రావడం అభిమానులకు బాగానే ఉన్నా, అలా ఒకరితో ఒకరు పోటీ పడడం వల్ల, నిర్మాతలకు నష్టం. పెద్ద సినిమాలకెప్పుడూ సోలో రిలీజే బెటర్ ఆప్షన్. సంక్రాంతి లాంటి సీజన్లలో మాత్రం.. పోటీ తప్పదు. కానీ మిగిలిన సమయాల్లో సోలో రిలీజ్ కే మొగ్గు చూపుతుంటారు. కానీ మధ్య క్లాష్ లు పెరిగాయి. వేరే వేరే హీరోల మధ్య క్లాష్ వస్తే ఫర్వాలేదు. ఒకే కుటుంబంలో ఉన్న హీరోల మధ్య వస్తేనే సమస్య.
విషయం ఏమిటంటే... అల్లు అర్జున్ `పుష్ష` డిసెంబరు 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ ని చిత్రబృందం కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు అదే రోజున.. చిరు `ఆచార్య` విడుదల అవుతోందని సమాచారం. డిసెంబరు 17న ఈసినిమా విడుదల చేయాలని, చిరు భావిస్తున్నాడట. నిజానికి పుష్ష డిసెంబరు 25న వస్తుందని అంతా ఆశించారు. క్రిస్మస్ కి వస్తున్నాం అని చిత్రబృందం చెప్పడంతో.. పుష్ష డిసెంబరు 25నే అనుకున్నారు. అందుకే ఆచార్యని ఒక వారం ముందుగా అంటే డిసెంబరు 17న విడుదల చేద్దామనుకున్నారు.
ఆచార్య రిలీజ్ డేట్ ప్రకటించడానికంటే ముందు.. పుష్ష రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. అందుకే ఆచార్య కూడా డిసెంబరు 17నే ఫిక్సవ్వాలని అనుకుంటున్నార్ట. కాకపోతే... మెగా కుటుంబం నుంచి ఒకేరోజు రెండు సినిమాలు రావడం కరెక్ట్ కాదు. అభిమానులకు తప్పుడు సంకేతాలు అందుతాయి. దాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన బాధ్యత రెండు సినిమాలపైనా ఉంది.