ఉరుము ఉరిమి మంగళం మీదపడినట్టు - RRR రిలీజ్ కాస్త సంక్రాంతి సీజన్ కే ముప్పుగా మారింది. జనవరి 7న RRR విడుదల చేస్తున్నట్టు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. RRR విడుదల అనేది.... రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు ఎంత తీపి వార్తో, సంక్రాంతి చిత్రాలకు అంత చేదు వార్త. ఎందుకంటే ఈ సీజన్‌లో 4 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. రిలీజ్ డేట్లు కూడా ప్రకటించేశాయి. కానీ సడన్ గా RRR ఎంట్రీ ఇచ్చింది. జనవరి 7న RRR వస్తోంది. అంటే.. పండక్కి వారం ముందే. మిగిలిన సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించాయి కాబట్టి... 7వ తేదీన రావడం కంటే మరో ఆప్షన్ RRR కి లేదు.
ఆ రకంగా.. ఆ 4 సినిమాలకు RRR కాస్త గ్యాప్ ఇచ్చినట్టే. కానీ ఈ గ్యాప్ సరిపోదు. బాహుబలి రేంజ్ సినిమా ఇదని ఫిల్మ్ ఇండ్రస్ట్రీ నమ్ముతోంది. బాహుబలి విడుదల సమయంలో చూడండి. రెండు వారాల ముందు, ఆ తరవాత మరో సినిమా ఏదీ రాలేదు. ఆ తరవాత వచ్చినా - బాహుబలి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈసారీ అదే జరగొచ్చు. కాబట్టి... RRR ని ఢీ కొట్టే ధైర్యం ఏ సినిమా చేయదు. సంక్రాంతి పెద్ద సీజన్. ఎన్ని సినిమాలొచ్చినా చోటు ఉంటుంది. స్టార్‌సినిమాలకైతే ఢోకా ఉండదు. కానీ రాజమౌళి సినిమా లెక్క వేరు. పైగా ఈసారి ఆయన మల్టీస్టారర్ ని దించుతున్నాడు.
ఇప్పటికే.. సర్కారు వారి పాట, రాధే శ్యామ్, ఎఫ్ 3 సినిమాల విడుదల విషయంలో నిర్మాతలు తర్జన భర్జనలు పడుతున్నారని టాక్. రాధే శ్యామ్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని, ఫిబ్రవరి 14న ఈచిత్రాన్ని విడుదల చేస్తారన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఎఫ్ 3 కూడా వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. RRR వస్తున్నా వెనుకడుగు వేయడానికి ఇష్టపడని సినిమా ఒక్క భీమ్లా నాయక్ మాత్రమే. RRR వచ్చినా సరే... భీమ్లా నాయక్ ని విడుదల చేయడానికే నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు.
మిగిలిన సినిమాల రాకతోనూ, వాటి వాయిదాతోనూ భీమ్లా నాయక్ కి సంబంధం లేదు. RRR కోసం తమ సినిమాని వాయిదా వేసుకోవడంలో నిర్మాతలకు ఎలాంభి అభ్యంతరాలూ లేవు. కాకపోతే.. ఒక్కటే సమస్య. విడుదల తేదీ ప్రకటించడం, ఆ తరవాత దాన్ని వాయిదా వేయడం రాజమౌళి సినిమాలకు చాలా మామూలు విషయాలు. లెక్కలన్నీ పక్కాగా కుదిరితే గానీ, రాజమౌళి తన సినిమాని రిలీజ్ చేయడు. ఇప్పటికే తన సినిమాకి ఎన్నో రిలీజ్ డేట్లు ఇచ్చుకున్నాడు. జనవరి 7నైనా వస్తాడా? లేదా? అనేది మరో అనుమానం. తీరా తమ సినిమాని వాయిదా వేసుకున్నాక, రాజమౌళి వెనకడుగు వేస్తే.. నిర్మాతలకు అది మరింత నరకయాతన. మరి ఈసారైనా రాజమౌళి మాట మీద నిలబడతాడో, లేదో చూడాలి.