ఆచార్య రిలీజ్ డేట్ వచ్చేసింది. 2022 ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే.. ఈ రిలీజ్ డేట్ విషయంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఈ యేడాది ఆచార్యని వెండి తెరపైచూసుకోవాలని అనుకున్నారు ఫ్యాన్స్. డిసెంబరులో విడుదల అవుతుందని భావించారు. ఓదశలో డిసెంబరు 17న ఆచార్య వచ్చేస్తోందని ప్రచారం సాగింది. పుష్ష కూడా అదే రోజున వస్తోండడంతో.. ఇద్దరు మెగా హీరోల పోటీగా అభివర్ణించారు. అయితే ఇప్పుడు ఆచార్య... వాయిదా పడిపోయింది. ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యింది. అంటే ఇంకా 4 నెలల సమయం ఉందన్నమాట. `ఆచార్య` షూటింగ్ దాదాపు అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతకాదన్నా డిసెంబర్ నాటికి సినిమా సిద్ధం అవుతుంది. అయినా ఇంకో రెండు నెలలు ఆగాలన్నమాట.
ఆచార్య ఇంత లేట్ గా రిలీజ్ చేయడానికి కారణం ఒక్కటే. ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు. థియేటర్ వ్యవస్థ పుంజుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఈలోగా థర్డ్ వేవ్ అంటున్నారు. జనవరిలో థర్డ్ వేవ్ వచ్చిపోయే అవకాశం ఉంది. అందుకే ఆచార్యని ఫిబ్రవరికి షిఫ్ట్ చేశారు. మరోవైపు.. ఏపీలో థియేటర్ పరిస్థితి ఏం బాగాలేదు. అక్కడ టికెట్ రేట్ల విషయంలో ఇంకా తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. 2022 సంక్రాంతి నాటికి పరిస్థితి సద్దుమణిగే అవకాశం ఉంది. అందుకే... ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్.