తమిళ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్యంతో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. విజయకాంత్ గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇందుకోసం పలు చోట్ల ట్రీట్ మెంట్ కూడా తీసుకున్నారు. కానీ ఈ ఏడాది నవంబర్ 18న జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్ర ఆరోగ్య సమస్యతో చెన్నైలోని బోరూర్ ఏరియాలో గల మయత్ ఆస్పత్రిలో చేరారు. సుమారు 23 రోజుల ట్రీట్ మెంట్ తరువాత డిసెంబర్ 11న డిశ్చార్జ్ అయ్యారు.
విజయకాంత్ అభిమానులు, డీఎండీకే పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు, ప్రజలలో ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను, భయాలను దూరం చేయడానికి ఎప్పటికప్పుడు మయట్ హాస్పిటల్, పార్టీ ప్రధాన కార్యాలయం కూడా విజయకాంత్ ఆరోగ్యం గురించి సమాచారాన్ని ఇస్తూ ఉండేవారు. అయినా ఒక సందర్భం లో విజయకాంత్ మరణ వార్తలు కూడా రావటంతో ఆయన భార్య ప్రేమలత కొన్ని రోజుల క్రితం వీడియో విడుదల చేశారు. అందులో విజయకాంత్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరారు. రీసెంట్ గా ఆయనకు కరోనా సోకడంతో బుధవారం విజయకాంత్ ని ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. ఆయన మృతదేహాన్ని మయత్ ఆసుపత్రి నుంచి విరుగంబాక్కంలోని ఆయన నివాసానికి తరలిస్తున్నారు.
విజయ్ కాంత్ 1952 ఆగస్టు 25 న మధురైలో జన్మించారు. నటుడుగా, నిర్మాతగా, గుర్తింపు తెచ్చుకున్న ఆయన రాజకీయాల్లో కూడా తన దైన ముద్ర వేశారు. విజయ్ కాంత్ నేరుగా తెలుగు సినిమాల్లో నటించలేదు కానీ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువాళ్ళకు దగ్గరయ్యారు. ఫాన్స్ ఈయన్ని 'పురాచీ కళింగర్' (విప్లవాత్మక నటుడు) అని ప్రేమగా పిలుచుకుంటారు. 1990 లో ప్రేమ లతను వివాహం చేసుకున్నారు. విజయ్ ప్రభాకర్, షణ్ముగ పాండ్యన్ అని ఇద్దరు కుమారులు.