చిరంజీవి హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా 'రౌడీ అల్లుడు', వెంకటేష్ హీరోగా నటించిన 'శత్రువు' తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మలయాళీ నటుడు కెప్టెన్ రాజు ఈ రోజు గుండెపోటుతో కన్ను మూశారు.
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఆయన. ఈ మధ్యనే ఒకసారి గుండెపోటుకు గురయ్యారు. ఒమన్‌లో అత్యవసర వైద్య చికిత్స పొందారు. అమెరికా వెళ్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని మార్గ మధ్యంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. కొన్ని రోజులు ఒమన్‌లోని ఓ ఆసుపత్రిలో ఉండిపోవల్సి వచ్చింది. కాస్త కోలుకున్నాక ఆయన తిరిగి ఇండియాకి వచ్చారు.
అయితే ఈ రోజు తెల్లవారుజామున మూడో సారి గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. కెప్టెన్ రాజు అసలు పేరు రాజు డేనియల్. ఆయనకి భార్య, ఓ కుమారుడున్నారు. 'కొండపల్లి రాజా', జైలర్‌గారి అబ్బాయి','గాండీవం', మొండి మొగుడు పెంకి పెళ్లాం', మాతో పెట్టుకోకు' తదితర తెలుగు సినిమాల్లో నటించారు. తమిళ, మలయాల, హిందీ తదితర భాషలతో కలిపి దాదాపు 500 చిత్రాల్లో నటించారాయన. దర్శకుడిగా రెండు చిత్రాలను చేశారు.
ఇండియన్ ఆర్మీలో కెప్టెన్ స్థాయికి ఎదిగారు. అందుకే ఆయన్ని అందరూ కెప్టెన్ రాజు అని పిలుస్తారు. ఆయన మరణవార్త విని ఫిల్మ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.