ప్రముఖ సినీ, రంగస్థల నటులు దీవి శ్రీనివాస దీక్షితులు కన్నుమూశారు. ఆయన వయసు 63 ఏళ్లు. మురారి, ఇంద్ర, అతడు, ఠాగూర్, వర్షం తదితర చిత్రాల్లో నటించారు. అతడులో... మహేష్ బాబు పూజారి ఇంటికి వెళ్లి, తులసి మెక్క కింద డబ్బులు దాచి వస్తాడు కదా?? ఆ పూజారిగా నటించింది దీక్షితులునే. సహజసిద్ఢమైన నటనకు ఆయన పెట్టింది పేరు. నిజాయతీతో కూడిన పాత్రలకు ఆయన్ని ఎంచుకునేవారు దర్శకులు. మురారిలో కూడా ఆయన పాత్ర గుర్తుండిపోతుంది.
ఆయన స్వస్థలం గుంటూరు. అధ్యాపకుడిగా పనిచేసిన అనుభవం ఉంది. నాటకాలపై ఆసక్తితో రంగస్థలంలో నటుడిగా, దర్శకుడిగా రాణించారు. ఆ తరవాత సినిమాల్లోకి వచ్చారు. ఆల్ ఇండియా రేడియాలోనూ పనిచేశారు. కొన్ని ధారావాహికలలో నటించారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌కి సమీపంలోని నాచారంలో గుండెపోటితో మరణించారు. మృతదేహాన్ని అమీర్ పేటలోని ఆయన స్వగృహానికి తరలించారు. నటుడు ఉత్తేజ్ దీక్షితులకు సమీప బంధువే. మంగళవారం దీక్షితులు అంత్యక్రియలు జరపనున్నట్టు సమాచారం.