ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. ఈరోజు ఉదయం గుంటూరులోని ఆయన తుది శ్వాస విడిచారు. ప్రేమించుకుందాం రా, సమర సింహారెడ్డి, నరసింహానాయుడు, జయం మనదేరా. రేసుగుర్రం, ఖైది నెం 150.. ఇలా సూపర్ హిట్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. విలన్, కమెడియన్, క్యారెక్టరు ఆర్టిస్టు పాత్రల్లో రాణించారు. రాయలసీమ యాసలో డైలాగులు చెప్పి భయపెట్టడంలో జయప్రకాష్‌రెడ్డి తరవాతే ఎవరైనా. ఫ్యాక్షనిస్టు విలన్ అంటే ముందు ఆయనే గుర్తొస్తారు. `ఢీ` సినిమాలో ఒక్క డైలాగూ లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్ తోనే నవ్వించారు.
1946 మే 8న కర్నూల్ జిల్లా సిరివెళ్లలో జన్మించారు జయప్రకాష్ రెడ్డి. నాటకాలంటే మక్కువ. బ్రహ్మపుత్రుడుతో సినీ రంగ ప్రవేశం జరిగింది. ప్రేమించుకుందాం రా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరవాత ఆయన వెను దిరిగి చూసుకోలేదు. ఢీ, కబడ్డీ కబడ్డీ. గబ్బర్ సింగ్ లాంటి చిత్రాల్లో నవ్వించారు కూడా. ఆయన చివరి చిత్రం.. సరిలేరు నీకెవ్వరు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచీ ఆయన గుంటూరులోనే ఉంటున్నారు. జయప్రకాష్‌రెడ్డి మరణం పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.