కరోనాపై అవగాహన పెంచడంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో యువ కథానాయకుడు కార్తికేయ కూడా నటించారు. `మీసం మెలేడం మగాడి లక్షణం.. అది ఒకప్పుడు.. ఇప్పుడు మాస్క్ పెట్టుకోవడమే వీరత్వం` అంటూ మాస్క్ ధరించడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని చిరు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆలోచన రాగానే.. దాన్ని ఆచరణలో పెట్టినందుకు ముందుకొచ్చిన యువ కథానాయకుడు కార్తికేయకు ప్రత్యేకంగా ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు చిరు.
కార్తికేయ కూడా చిరుతో కలసి ఈ వీడియోలో నటించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. `కరోనా భయం, షూటింగ్‌ని మిస్ అవడం, తర్వాత ఎలా ఉంటుందనే భయం.. ఈ ఒక్క వీడియోతో అన్నీ తీరిపోయాయి. ఓ మంచి పని కోసం మెగాస్టార్‌గారితో కలిసి నేను ఓ వీడియో చేశాను. నా సినిమాలు పది విడుదలైనా ఈ కిక్ రాదు. మెగాస్టార్ సర్‌తో ఇది నా జీవితకాల జ్ఞాపకం` అని కార్తికేయ ట్వీట్ చేశాడు. కార్తికేయ చిరుకి వీరాభిమాని. ఆమధ్య ఓ అవార్డు ఫంక్షన్‌లో చిరు ముందు.. చిరు పాటలకు స్టెప్పులేసి, అభిమానుల్ని అలరించాడు. చిరు ఆశీర్వాదాలూ తీసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా చిరుతో కలసి నటించే ఛాన్స్ సంపాదించగలిగాడు.