సహాయ దర్శకులుగా పనిచేసి హీరోలు అయిన జాబితా చాలా పెద్దదే ఉంది. రవితేజ, నాని.. వీళ్లంతా అక్కడి నుంచి వచ్చినవాళ్లే. నిఖిల్ కూడా... సహాయ దర్శకుడిగా అనుభవం గడించినవాడే. ఇప్పుడు దర్శకుడిగా మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. త్వరలోనే ఓ సినిమా చేస్తాడట. అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని తన మనసులోని మాట బయటపెట్టాడు.
అయితే ఇది కమర్షియల్ హంగులున్న సినిమా కాదని, ప్రయోగాత్మక చిత్రమని అంటున్నాడు. చిన్న పిల్లలతో ఓ సినిమా తీయబోతున్నానని ప్రకటించాడు. ఈ యేడాదే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 18 పేజీస్, కార్తికేయ 2 చిత్రాలలో నటిస్తున్నాడు నిఖిల్. వాటితో పాటే.. తన దర్శకుడిగా డెబ్యూ ఇవ్వబోతున్నాడు. మరి నిఖిల్ సినిమా ఎలా ఉండబోతోందో, తాను చేసే ప్రయోగం ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.