సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఉత్తమ నటనతో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఈ ప్రముఖ నటుడు, వివాదాలతోనూ వార్తల్లోకెక్కుతుంటాడు. పైగా ఈ మధ్య రాజకీయ వివాదాలతో ప్రకాష్ రాజ్ పేరు ప్రముఖంగా విన్పిస్తుండడం తెలిసిన సంగతే. ప్రకాష్‌రాజ్‌లో ఇంకో కోణం కూడా వుంది. అదే సోషల్ సర్వీస్. ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రకాష్‌రాజ్, ఆ గ్రామాభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా వుంటే, తాజాగా ప్రకాష్‌రాజ్ సోషల్ మీడియాలో చేసిన ఓ ప్రకటన పెను సంచలనంగా మారింది. అదేంటంటే, కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో మొత్తం భారతదేశం దాదాపుగా ‘లాక్ డౌన్’ అయిపోయింది.
ఈ నేపథ్యంలో తన దగ్గర పనిచేసేవారందరికీ రెండు నెలలకు ముందుగానే జీతాల్ని ఇచ్చేశాడట. తన బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలెన్స్ చూసుకుని, వున్నంతలో అందరికీ మే నెల వరకూ జీతాలు సెటిల్ చేసేశానని పేర్కొన్నాడు ప్రకాష్‌రాజ్. ఎవరికైనా కుదిరితే వాళ్ళు కూడా అదే పని చేయాలని పిలుపునిచ్చాడు ప్రకాష్‌రాజ్. ఇంత విశాల హృదయంతో ఆలోచించేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరైనా వుంటారా? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మామూలుగా అయితే ప్రకాష్‌రాజ్ సోషల్ మీడియాలో ఏదన్నా విషయాన్ని ప్రస్తావిస్తే, అతన్ని విమర్శించేవాళ్ళే ఎక్కువ. కానీ, ఇక్కడ ప్రకాష్‌రాజ్‌ని అందరూ అభినందనలతో ముంచెత్తేస్తున్నారు.