గత నెల 12న ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద రాజశేఖర్ కారు అదుపు తప్పి బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి రోడ్డు రవాణా సంస్థ అధికారులు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇలాగే మితిమీరిన వేగంతో కారు నడుపుతూ పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ కారును రాజశేఖర్ తన వాహనంతో ఢీకొట్టారు. వరుస రోడ్డు ప్రమాదాలకు కారణమైనందున, ఆయా ప్రమాద సమయాల్లో రాజశేఖర్ స్వయంగా కారు డ్రైవ్ చేసిన దర్మిలా ఆయన డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారనీ తెలుస్తోంది. అంతేకాదు, రాజశేఖర్ నడిపిన కారుకు ఏడాదిలోనే దాదాపు 21 ట్రాఫిక్ ఉల్లంఘనలున్నట్లు తేలింది.
వాటిలో 19 వరకూ అధిక వేగానికి సంబంధించినవేనట. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన డ్రైవింగ్ లైసెన్స్ కాల పరిమితి దాటి రెండేళ్లు అయ్యిందట. ప్రస్తుతం అది సస్పెన్షన్‌లో ఉన్నందున రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. వచ్చే ఏడాది మే 28 తర్వాత లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవల్సి ఉంటుంది. అంతవరకూ ఆయన వాహనం నడిపితే, చట్ట పరమైన శిక్షలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.